కోలుకుంటున్నా.. అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు: శ్రేయస్ అయ్యర్

  • సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు
  • రోజురోజుకు తన ఆరోగ్యం మెరుగవుతోందని వెల్లడి
  • ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డ‌ అయ్యర్
  • ప్లీహానికి గాయం కావడంతో ఐసీయూలో చికిత్స అందించిన వైద్యులు
  • అయ్యర్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఇప్ప‌టికే ప్రకటించిన బీసీసీఐ
గాయంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తన ఆరోగ్యంపై స్పందించాడు. తాను ప్రస్తుతం కోలుకుంటున్నానని, అండగా నిలిచిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుతూ గురువారం సోషల్ మీడియాలో ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు. ఆయన పోస్ట్‌తో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

"ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను. రోజురోజుకు నా ఆరోగ్యం మెరుగవుతోంది. నాకు అండగా నిలిచి, నేను బాగుండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి ప్రేమ, మద్దతు నాకు చాలా విలువైంది. నన్ను మీ ప్రార్థనలలో గుర్తుంచుకున్నందుకు ధన్యవాదాలు" అని అయ్యర్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.

ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఓ అద్భుతమైన క్యాచ్ అందుకునే ప్రయత్నంలో ఆయన పక్కటెముకల ప్రాంతంలో బలంగా దెబ్బ తగిలింది. దీంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. తొలుత సాధారణ గాయంగా భావించినప్పటికీ, స్కానింగ్‌లో ప్లీహానికి (spleen) తీవ్రమైన గాయమైనట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం అతడిని ఐసీయూకి తరలించారు.

ఈ ఘటనపై బీసీసీఐ ఈ నెల‌ 27, 28 తేదీల్లో ప్రకటనలు విడుదల చేసింది. "అక్టోబర్ 25న ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు శ్రేయస్ అయ్యర్ కడుపు భాగంలో బలమైన దెబ్బ తగలడంతో ప్లీహం దెబ్బతిని, అంతర్గత రక్తస్రావం జరిగింది. గాయాన్ని వెంటనే గుర్తించి, రక్తస్రావాన్ని అరికట్టడం జరిగింది. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. ఈ నెల 28న తీసిన స్కానింగ్‌లో అతని ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడినట్లు తేలింది" అని బీసీసీఐ తెలిపింది. సిడ్నీ, భారత నిపుణుల పర్యవేక్షణలో అయ్యర్ కోలుకుంటున్నారని వెల్లడించింది. తాజాగా అయ్యర్ కూడా తన ఆరోగ్యంపై స్పష్టత ఇవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News