Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం: వద్దని చెప్పినా స్నేహితుడు వినలేదు.. ఎర్రిస్వామి వాంగ్మూలం

Kurnool Bus Accident Mystery Solved Friends Statement Reveals Truth
  • కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో వెలుగులోకి కొత్త విషయాలు 
  • ప్రమాదానికి ముందు తనతోనే ఉన్న శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామి
  • ఇద్దరం కలిసి మద్యం సేవించామని అంగీకారం
  • అర్ధరాత్రి డ్రాప్ చేస్తానంటూ శివశంకర్ బయల్దేరాడని వెల్లడి
  • బైక్‌కు లైట్ లేదని, వద్దని వారించినా వినలేదని వివరణ  
తెలుగు రాష్ట్రాలలో తీవ్ర విషాదాన్ని నింపిన కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 19 మందిని బలిగొన్న ఈ దుర్ఘటనకు సంబంధించి పోలీసులు జరుపుతున్న దర్యాప్తులో మృతుడు శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామి ఇచ్చిన వాంగ్మూలం కీలకంగా మారింది. ప్రమాదానికి ముందు ఏం జరిగిందో వివరిస్తూ, అతను చెప్పిన వివరాలు ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను స్పష్టం చేస్తున్నాయి.

హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న తాను, స్నేహితుడి పెళ్లి కోసం కర్నూలు జిల్లా పెద్దటేకూరులోని తన తల్లి ఇంటికి వచ్చానని, అయితే అప్పుడు ఆమె ఇంట్లో లేరని ఎర్రిస్వామి మీడియాకు వివరించాడు. "అదే రోజు సాయంత్రం ఇంటికి వచ్చాక, శివశంకర్‌కు ఫోన్ చేశాను. దాంతో మా ఇంటికి వచ్చాడు. ఇద్దరం కలిసి అతని బైక్‌పై రాత్రి 7 గంటలకు వైన్ షాపుకు వెళ్లి మద్యం కొనుగోలు చేసి రెండుసార్లు తాగాము. ఆ తర్వాత రాత్రి 9:15 గంటల సమయంలో మా ఇంటికి వచ్చి నిద్రపోయాం" అని ఎర్రిస్వామి తెలిపాడు.

అయితే, రాత్రి 10:30 గంటల సమయంలో తన తల్లికి ఫోన్ చేసి, రాంపల్లిలో స్నేహితుడి పెళ్లికి వెళ్తున్నానని తాను చెప్పినట్లు ఎర్రిస్వామి పేర్కొన్నాడు. ఇంత రాత్రిపూట వద్దని, ఉదయం వెళ్లమని తల్లి సూచించినా తాను వినలేదన్నాడు. "అర్ధరాత్రి 2:15 గంటల సమయంలో శివశంకర్ నన్ను నిద్రలేపాడు. డోన్‌ వరకు తీసుకెళ్లి వదిలేస్తానని చెప్పాడు. నేను వద్దని, కర్నూలు బస్టాండ్‌లో వదిలేస్తే బస్సులో వెళ్తానని చెప్పాను. కానీ అతను నా మాట వినలేదు" అని ఎర్రిస్వామి వివరించాడు.

ప్రమాదానికి ముందు తాను శివశంకర్‌ను హెచ్చరించినట్లు ఎర్రిస్వామి చెప్పిన మాటలు ఈ కేసులో అత్యంత కీలకంగా మారాయి. "మనం ఇద్దరం తాగి ఉన్నాం, పైగా నీ బైక్‌కు హెడ్‌లైట్ (డూమ్‌లైట్‌) కూడా లేదు, ఈ సమయంలో ప్రయాణం వద్దు" అని తాను ఎంత చెప్పినా శివశంకర్ వినకుండా బైక్ తీశాడని ఎర్రిస్వామి పేర్కొన్నాడు. అతని వాంగ్మూలంతో మద్యం మత్తులో, లైట్ లేని బైక్‌పై అర్ధరాత్రి ప్రయాణమే ప్రమాదానికి ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. పోలీసులు ఈ వివరాల ఆధారంగా దర్యాప్తును మరింత లోతుగా కొనసాగిస్తున్నారు.
Kurnool Bus Accident
Kurnool
bus accident
Erriswamy
Sivasankar
Andhra Pradesh road accident
road accident
drunk driving
police investigation
fatal accident

More Telugu News