గంభీర్‌కు అర్షదీప్‌తో అసలు సమస్య ఏంటి?.. భగ్గుమంటున్న అభిమానులు!

  • కోచ్‌గా గంభీర్ వచ్చాక అర్షదీప్‌కు దూరమైన జట్టులో చోటు
  • టీ20ల్లో అత్యధిక వికెట్ల రికార్డు ఉన్నా దక్కని అవకాశం
  • ఆసీస్‌తో టీ20 సిరీస్‌లోనూ అర్షదీప్‌కు మొండిచెయ్యి
  • హర్షిత్ రాణాకు అవకాశాలిస్తూ అర్షదీప్‌ను పక్కనపెడుతున్నారన్న విమర్శలు
  • గంభీర్ తీరుపై సోషల్ మీడియాలో మండిపడుతున్న అభిమానులు
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయాలు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. టీమిండియా స్టార్ పేసర్, టీ20 ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అయిన అర్షదీప్ సింగ్‌ను పదేపదే పక్కన పెట్టడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లోనూ అతడికి అవకాశం ఇవ్వకపోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది.

టీమిండియా తరఫున టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా అర్షదీప్ సింగ్‌కు మంచి పేరుంది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ విజయంలోనూ అతను కీలక పాత్ర పోషించాడు. అయినప్పటికీ, గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అర్షదీప్‌కు జట్టులో స్థానం కష్టంగా మారింది. తుది జట్టులో చోటు దక్కకపోవడం ఇప్పుడు పరిపాటిగా మారింది.

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లలో ఆడిన అర్షదీప్‌ను, కీలకమైన మూడో మ్యాచ్‌కు పక్కనపెట్టి యువ బౌలర్ హర్షిత్ రాణాకు అవకాశం ఇచ్చారు. అయితే ఆ మ్యాచ్‌లో హర్షిత్ రాణా నాలుగు వికెట్లు పడగొట్టి తన ఎంపిక సరైనదేనని నిరూపించుకున్నాడు. కానీ, ఇప్పుడు టీ20 సిరీస్‌లోనూ అర్షదీప్‌ను బెంచ్‌కే పరిమితం చేయడంతో అభిమానుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

"గంభీర్‌కు అర్షదీప్‌తో అసలు సమస్య ఏంటి?", "టీ20 ప్రపంచకప్ గెలిపించిన బౌలర్‌ను ఇలా పక్కన పెడతారా?", "హర్షిత్ రాణా ఏమైనా అర్షదీప్ కంటే గొప్ప బౌలరా?" అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. గంభీర్ కోచ్ అయ్యాక ఇంగ్లండ్ సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఇదే పరంపర కొనసాగుతోందని, ఇది అతని కెరీర్‌పై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోచ్‌గా గంభీర్ తీసుకుంటున్న ఈ అనూహ్య నిర్ణయాలు జట్టులో గందరగోళానికి దారితీస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.


More Telugu News