కొత్త నెంబర్ల నుంచి ఫోన్ చేసినా పేరు కనిపిస్తుంది... మార్చి నుంచి కాలర్ ఐడీ

  • తెలియని నంబర్ల నుంచి కాల్స్ వస్తే ఇకపై పేరు డిస్‌ప్లే
  • కాలింగ్ నేమ్ ప్రజంటేషన్ (CNAP) ఫీచర్‌కు ట్రాయ్ ఆమోదం
  • సైబర్ మోసాలు, ఫ్రాడ్ కాల్స్‌ను అరికట్టడమే ప్రధాన లక్ష్యం
  • సిమ్ కార్డు ఐడీలోని అధికారిక పేరే స్క్రీన్‌పై ప్రదర్శన
  • 2026 మార్చి నాటికి దేశవ్యాప్తంగా అమలుకు సన్నాహాలు
  • 4జీ, 5జీ ఫోన్లలో మాత్రమే అందుబాటులోకి రానున్న ఈ సదుపాయం
తెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్ వస్తే అది ఎవరిదో తెలుసుకోవడానికి 'ట్రూకాలర్' వంటి థర్డ్ పార్టీ యాప్‌లపై ఆధారపడాల్సిన అవసరం ఇకపై ఉండకపోవచ్చు. కాల్ చేసే వ్యక్తి పేరును నేరుగా ఫోన్ స్క్రీన్‌పైనే ప్రదర్శించే ‘కాలింగ్ నేమ్ ప్రజంటేషన్’ (CNAP) అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు టెలికాం సంస్థలు సిద్ధమవుతున్నాయి. సిమ్ కార్డు తీసుకునే సమయంలో ఇచ్చిన అధికారిక గుర్తింపు కార్డులోని పేరునే ఇన్‌కమింగ్ కాల్స్ సమయంలో చూపించనున్నారు. దేశవ్యాప్తంగా 2026 మార్చి నాటికి ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

పెరిగిపోతున్న సైబర్ నేరాలు, ముఖ్యంగా ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో జరుగుతున్న మోసాలు, ఫేక్ కాల్స్‌ను అరికట్టే లక్ష్యంతో టెలికాం విభాగం (DoT) ఈ CNAP విధానాన్ని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) కూడా తాజాగా ఆమోదం తెలిపింది. ఫోన్ కనెక్షన్ తీసుకునేటప్పుడు వినియోగదారుడు సమర్పించిన గుర్తింపు కార్డులోని పేరును కాల్స్ సమయంలో ప్రదర్శించేందుకు అంగీకరించింది.

అయితే, వినియోగదారులకు తమ పేరును ఇతరులకు కనిపించకుండా ఉంచుకునే వెసులుబాటు కూడా కల్పించనున్నారు. తమ పేరు డిస్‌ప్లే కాకూడదని భావిస్తే, ఆ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. మరోవైపు, ఈ ఫీచర్‌ను 2జీ, 3జీ నెట్‌వర్క్‌లలో అమలు చేయడం సాంకేతికంగా సవాలుతో కూడుకున్నదని ట్రాయ్, డాట్ అభిప్రాయపడ్డాయి. అందువల్ల, ప్రస్తుతం 4జీ, ఆపై నెట్‌వర్క్‌లు ఉన్న స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే ఈ సౌకర్యం వర్తిస్తుంది.

ప్రస్తుతం ఈ ఫీచర్‌ను హర్యానా సర్కిల్‌లో రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా సంస్థలు ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నాయి. త్వరలోనే అన్ని టెలికాం కంపెనీలు దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేసేలా డాట్ చర్యలు తీసుకుంటోంది. 2026 మార్చి 31 నాటికి ఈ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కొత్త విధానంతో ఫేక్ కాల్స్ బెడద తగ్గడమే కాకుండా, వినియోగదారులకు భద్రత పెరుగుతుందని భావిస్తున్నారు.


More Telugu News