Hyderabad: హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఒకే టికెట్‌తో బస్సు, మెట్రో, ఎంఎంటీఎస్ ప్రయాణం!

Hyderabad to get Unified Ticketing System for Bus Metro and MMTS
  • హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్, మెట్రో, ఆర్టీసీ బస్సుల అనుసంధానం
  • ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీ, ట్రాఫిక్ తగ్గింపు ప్రధాన లక్ష్యం
  • ఎంఎంటీఎస్ స్టేషన్ల వద్ద రోడ్ల విస్తరణ, బస్సు రూట్ల మార్పు
  • అన్నింటికీ కలిపి ఒకే టికెట్ వ్యవస్థపై సాధ్యాసాధ్యాల పరిశీలన
హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రణాళికను ప్రారంభించింది. ఎంఎంటీఎస్, మెట్రో రైలు, టీజీఎస్‌ఆర్టీసీ బస్సు సర్వీసులను పరస్పరం అనుసంధానిస్తూ సమగ్ర వ్యవస్థను రూపొందిస్తున్నట్లు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ తెలిపారు. ప్రయాణికులకు ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీని మెరుగుపరచడం, రహదారులపై ట్రాఫిక్ రద్దీని తగ్గించడం ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.

సచివాలయంలో నిన్న‌ జరిగిన ఉన్నతస్థాయి సమావేశం అనంతరం వికాస్ రాజ్ ఈ వివరాలు వెల్లడించారు. మొత్తం 51 ఎంఎంటీఎస్ స్టేషన్ల పరిసరాల్లో అనుసంధాన రహదారులను విస్తరించాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించినట్లు చెప్పారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ఎంఎంటీఎస్ స్టేషన్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే అధికారులు జీహెచ్‌ఎంసీ, ఆర్టీసీతో పంచుకుంటారని తెలిపారు. ఈ సమాచారం ఆధారంగా బస్ స్టాప్‌లను రైల్వే స్టేషన్లకు దగ్గరగా మార్చడంతో పాటు, రద్దీ ప్రాంతాలకు అనుగుణంగా బస్సు రూట్లను పునర్వ్యవస్థీకరిస్తారని వివరించారు.

ఎంఎంటీఎస్ స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు ప్రయాణికులను చేరవేసేందుకు ప్రైవేట్ ఫీడర్ సర్వీసులను ప్రవేశపెట్టే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సుల్లో ఒకే టికెట్‌తో ప్రయాణించేందుకు వీలుగా సమగ్ర టికెటింగ్ వ్యవస్థపై అధ్యయనం చేయాలని మీ-సేవ కమిషనర్‌కు సూచించినట్లు వికాస్ రాజ్ వెల్లడించారు. ఇది హైదరాబాద్‌లో మల్టీమోడల్ రవాణా వ్యవస్థ ఏర్పాటు దిశగా కీలక ముందడుగు అని ఆయన అభిప్రాయపడ్డారు.
Hyderabad
MMTS
Metro Rail
TGSRTC
Bus Services
Integrated Transport System
Multi modal Transport
Telangana
GHMC
Vikas Raj

More Telugu News