DK Shivakumar: బెంగళూరు టన్నెల్ ప్రాజెక్టుపై డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్య... తేజస్వీ సూర్య కౌంటర్

DK Shivakumar Remarks on Bangalore Tunnel Project Tejasvi Surya Counter
  • టన్నెల్ రోడ్డు ప్రాజెక్టును సమర్థిస్తున్న ఉప ముఖ్యమంత్రి
  • ఈ ప్రాజెక్టుకు బదులు ట్రాన్స్‌పోర్టును విస్తరించాలంటున్న బీజేపీ ఎంపీ
  • కారు లేని అబ్బాయిలకు పిల్లను ఇవ్వడం లేదన్న డీకే శివకుమార్
  • టన్నెల్ ప్రాజెక్టు సామాజిక సమస్య తీర్చడానికా అంటూ తేజస్వీ ఎద్దేవా
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీ.కె. శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సొంత కారు లేని అబ్బాయిలకు పిల్లనివ్వడానికి కూడా ఆలోచిస్తున్నారని ఆయన అన్నారు. బెంగళూరులో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రతిపాదించిన టన్నెల్ రోడ్డు ప్రాజెక్టును సమర్థిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఈ టన్నెల్ ప్రాజెక్టును రద్దు చేసి, ప్రజా రవాణా వ్యవస్థను విస్తరించాలని కోరారు. ఈ మేరకు ఆయన ఉప ముఖ్యమంత్రిని కలిశారు.

ఈ సందర్భంగా డీ.కె. శివకుమార్ మాట్లాడుతూ, ప్రజలు కార్లు కొనడం వెనుక ఉన్న సామాజిక పరిస్థితి తేజస్వీ సూర్యకు అర్థం కాదని అన్నారు. "మీరు సొంత వాహనంలో రాకుండా నేను ఆపగలనా? ప్రజలు సొంత వాహనాల్లో వెళ్లడానికే మొగ్గు చూపుతారు. వారిని కార్లు ఉపయోగించవద్దని చెప్పగలమా? అంతగా అవసరమైతే ప్రజా రవాణాను ఉపయోగించుకోమని ఎంపీలు విజ్ఞప్తి చేసుకోవాలి. దానిని ఎంతమంది వింటారో చూడాలి. కారు లేని అబ్బాయిలకు పిల్లను ఇవ్వడానికి కూడా ప్రజలు ఆలోచిస్తున్న పరిస్థితి" అని ఆయన పేర్కొన్నారు.

డీ.కె. శివకుమార్ వ్యాఖ్యలకు తేజస్వీ సూర్య కూడా ప్రతిస్పందించారు. టన్నెల్ రోడ్డు ప్రాజెక్టును బెంగళూరు ట్రాఫిక్ సమస్యను తీర్చడానికి తీసుకువచ్చారని తాను భావించానని, కానీ ఇది ఒక సామాజిక సమస్యను పరిష్కరించడానికి ఉద్దేశించినదని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారని ఆయన ఎద్దేవా చేశారు. తాను ఎంత తెలివి తక్కువగా ఆలోచించానోనని ఉప ముఖ్యమంత్రిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

టన్నెల్ రోడ్డు ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ప్రజా రవాణాకు ప్రాధాన్యతనిచ్చే ప్రతిపాదనలు తాను చేశానని తేజస్వీ సూర్య వెల్లడించారు. అయితే, వాటిని ఉపముఖ్యమంత్రి తిరస్కరించారని ఆయన తెలిపారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి టన్నెల్ ప్రాజెక్టు ఒక మంచి పరిష్కారమని ఉప ముఖ్యమంత్రి చెబుతుండగా, అది పర్యావరణానికి హాని కలిగిస్తుందని, ప్రజా రవాణా విషయంలో సరైన పరిష్కారం కాదని తేజస్వీ సూర్య వాదిస్తున్నారు.
DK Shivakumar
DK Shivakumar tunnel project
Tejasvi Surya
Bangalore traffic
Karnataka politics

More Telugu News