Chandrababu Naidu: తుపాను బాధితులకు సీఎం చంద్రబాబు పరామర్శ... ఫొటోలు ఇవిగో!

Chandrababu Naidu Visits Cyclone Affected Victims in Kona Seema
  • మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
  • కోనసీమ జిల్లా ఓడలరేవులో బాధితులను పరామర్శించిన ముఖ్యమంత్రి
  • ప్రభుత్వ సాయం అందిందని సీఎంకు వివరించిన నిర్వాసితులు
  • నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి రైతులకు ధైర్యం
  • పంట నష్టంపై త్వరగా అంచనా వేసి ఆదుకుంటామని హామీ
  • బాపట్ల, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే
మొంథా తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే నిర్వహించి నష్టాన్ని అంచనా వేశారు. క్షేత్రస్థాయిలో బాధితులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని ఆయన భరోసా ఇచ్చారు.

పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి అల్లవరం మండలం ఓడలరేవులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న తుపాను బాధితులతో నేరుగా మాట్లాడి వారి యోగక్షేమాలను విచారించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.3 వేల తక్షణ ఆర్థిక సాయంతో పాటు, 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు తమకు అందాయని బాధితులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వారికి ధైర్యం చెప్పారు. ఈ పర్యటన సందర్భంగా చంద్రబాబు తన కాన్వాయ్ వాహనం నుంచి దిగి ఓ ఇన్నోవా కారులో బాధితులకు వద్దకు వెళ్లారు. నిరాశ్రయులుగా మారిన వారి వద్దకు వెళ్లేందుకు ఆయన ప్రోటోకాల్ ను కూడా పక్కనపెట్టారు.

ఈ పర్యటన అనంతరం... అరగట్లపాలెం, బెండమూరులంక గ్రామాలకు వెళ్లి నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. పొలాల్లోకి దిగి దెబ్బతిన్న వరి పంటను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. తుపాను కారణంగా జరిగిన నష్టం వివరాలను రైతులు ఆయనకు వివరించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి, వీలైనంత త్వరగా పంట నష్టం అంచనాలను పూర్తి చేసి, బాధితులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

క్షేత్రస్థాయి పర్యటనకు ముందు సీఎం చంద్రబాబు హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే చేపట్టారు. కోనసీమతో పాటు బాపట్ల, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో తుపాను వల్ల జరిగిన పంట నష్టం తీవ్రతను గగనతలం నుంచి పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Cyclone
Montha Cyclone
Kona Seema
Flood Relief
Crop Damage
Aerial Survey
Farmers
Financial Assistance

More Telugu News