హెచ్చరికలు బేఖాతరు.. వరద నీటిలో కొట్టుకుపోయిన డీసీఎం... డ్రైవర్ గల్లంతు.. వీడియో ఇదిగో!

  • మొంథా తుపాను కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు
  • ఖమ్మం జిల్లాలో ఉప్పొంగిన నిమ్మవాగు
  • స్థానికుల హెచ్చరికలు పట్టించుకోని డీసీఎం డ్రైవర్
  • వరద ప్రవాహంలో వాహనంతో పాటు కొట్టుకుపోయిన వైనం
  • గల్లంతైన డ్రైవర్ కోసం కొనసాగుతున్న గాలింపు
మొంథా తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణలో విషాదం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటేందుకు ప్రయత్నించి, ఓ డీసీఎం వ్యాను కొట్టుకుపోగా, డ్రైవర్ గల్లంతయ్యాడు. స్థానికులు వద్దని వారిస్తున్నా వినకుండా ముందుకు వెళ్లడమే ఈ ప్రమాదానికి కారణమైంది.

ఈ ఘటన కొణిజర్ల మండలం, జనారం వంతెన సమీపంలోని నిమ్మవాగు వద్ద జరిగింది. తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలతో నిమ్మవాగు ఉప్పొంగి వంతెన పైనుంచి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో, ఓ డీసీఎం డ్రైవర్ తన వాహనంతో వాగును దాటేందుకు సిద్ధమయ్యాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, నీటి ప్రవాహం ఎక్కువగా ఉందని, ముందుకు వెళ్లవద్దని గట్టిగా హెచ్చరించారు. అయినా ఆ డ్రైవర్ వారి మాటలను పెడచెవిన పెట్టి వాహనాన్ని నీటిలోకి నడిపాడు.

కొద్ది దూరం వెళ్లేసరికి ప్రవాహం ధాటికి డీసీఎం అదుపుతప్పి పక్కకు ఒరిగిపోయింది. చూస్తుండగానే ఆ ఎరుపు రంగు ట్రక్కు నీటిలో కొట్టుకుపోయింది. ఈ భయానక దృశ్యాలను కొందరు తమ ఫోన్లలో చిత్రీకరించారు. సమాచారం అందుకున్న అధికారులు గల్లంతైన డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


More Telugu News