జూబ్లీహిల్స్ ఖరీదైన ప్రాంతమే కానీ వారి బాధలు వర్ణనాతీతం: ఈటల రాజేందర్

  • జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దీపక్ రెడ్డి తరఫున ఈటల రాజేందర్ ప్రచారం
  • జూబ్లీహిల్స్‌లో మురికి కాలువలు, దుర్వాసన, గతుకుల రోడ్లు కూడా కనిపిస్తాయన్న ఈటల
  • బస్తీల్లోని ప్రజల బాధలు వర్ణనాతీతమన్న ఈటల రాజేందర్
జూబ్లీహిల్స్ అంటే హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతమే అయినప్పటికీ, ఇదే నియోజకవర్గంలోని బస్తీల్లో ప్రజల బాధలు వర్ణనాతీతమని మల్కాజ్‌గిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పేరుకే ఇది జూబ్లీహిల్స్ అని, కానీ ఇక్కడ కూడా మురికి కాలువలు, దుర్వాసన, గతుకుల రోడ్లు కనిపిస్తాయని అన్నారు.

ఏ పేదవాడిని కదిలించినా తమను పట్టించుకునే వారే లేరని బాధపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్‌ల విషయంలో నిన్న బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అదే గతి పడుతుందని అన్నారు. 40 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ ఎలా ఉందో.. ఇప్పుడు కూడా అలాగే ఉందని ఎద్దేవా చేశారు.

మంత్రుల మధ్య ఏమాత్రం సమన్వయం లేదని ఈటల రాజేందర్ అన్నారు. మంత్రులకు డబ్బులు సంపాదించుకోవడానికి, దోచుకోవడానికే సమయం సరిపోతుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీ వేదికగా బీజేపీ మాత్రమే కొట్లాడుతోందని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను బొంద పెడితేనే చలనం వస్తుందని అన్నారు.

ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశం సుభిక్షంగా ఉండాలంటే నరేంద్ర మోదీయే ప్రధానిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. మోదీ లేకపోతే దేశం అధోగతి పాలవుతుందనే భావన ప్రజల్లో ఉందని అన్నారు. జూబ్లీహిల్స్‌లో బీజేపీ చాపకింద నీరులా విస్తరిస్తోందని ఆయన అన్నారు.


More Telugu News