తీవ్ర తుపానుగా మారిన 'మొంథా'

  • ఏపీ తీరం వైపు వేగంగా కదులుతున్న తుపాను
  • కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం
  • ఈరోజు సాయంత్రానికి తీరాన్ని తాకనున్న వైనం
  • తీరం దాటే సమయంలో గంటకు 110 కి.మీ.తో గాలులు
బంగాళాఖాతంలో ఏర్పడిన 'మొంథా' తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. ఈ తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా కదులుతున్నట్లు విశాఖలోని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ రోజు సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య, కాకినాడ సమీపంలో ఇది తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు.
 
గడిచిన ఆరు గంటలుగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఈ తుపాను ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తోందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం ఇది మచిలీపట్నానికి 190 కి.మీ, కాకినాడకు 270 కి.మీ, విశాఖపట్నానికి 340 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు నిర్ధారించారు. 
 
తీరం దాటే సమయంలో పెనుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గరిష్ఠంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.


More Telugu News