ఢిల్లీ యాసిడ్ దాడి కేసులో బిగ్ ట్విస్ట్.. కటకటాల వెనక్కి బాధితురాలి తండ్రి

  • ఢిల్లీ యాసిడ్ దాడి కేసులో అనూహ్య మలుపు
  • బాధితురాలి తండ్రే దాడికి సూత్రధారి అని తేల్చిన పోలీసులు
  • అత్యాచారం కేసు నుంచి తప్పించుకునేందుకే ఈ నాటకం
  • ప్రత్యర్థిని ఇరికించేందుకు కూతురితో కలిసి కుట్ర
  • తండ్రి అకిల్ ఖాన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
  • టాయిలెట్ క్లీనింగ్ యాసిడ్‌తో దాడి జరిగినట్లు చిత్రీకరణ
దేశ రాజధాని ఢిల్లీలో 20 ఏళ్ల యూనివర్సిటీ విద్యార్థినిపై జరిగిన యాసిడ్ దాడి కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ దాడికి సూత్రధారి బాధితురాలి తండ్రేనని తేలడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. తనపై నమోదైన అత్యాచారం కేసు నుంచి తప్పించుకునేందుకు, ప్రత్యర్థిని ఈ కేసులో ఇరికించేందుకు కన్న కూతురితో కలిసి ఈ నాటకం ఆడినట్లు నిందితుడు అంగీకరించాడు.  

ఆదివారం నార్త్ ఢిల్లీలోని అశోక్ విహార్‌లో తనపై జితేందర్ అనే వ్యక్తి, అతడి స్నేహితులు ఇషాన్, అర్మాన్‌లు యాసిడ్‌తో దాడి చేశారని డీయూ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు బాధితురాలి తండ్రి అకిల్ ఖాన్‌ను విచారించగా అసలు నిజం బయటపడింది. జితేందర్ భార్య తనపై అత్యాచారం కేసు పెట్టడంతో, అతడిపై కక్ష తీర్చుకునేందుకు ఈ దాడి నాటకం ఆడినట్లు అకిల్ ఖాన్ అంగీకరించాడు. దీంతో పోలీసులు అతడిని సోమవారం అరెస్ట్ చేశారు.

కేసు ఎలా మలుపు తిరిగిందంటే..
అక్టోబర్ 24న జితేందర్ భార్య.. అకిల్ ఖాన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2021 నుంచి 2024 మధ్య కాలంలో అకిల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు, అతడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అభ్యంతరకర ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసి అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. ఈ కేసు నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో అకిల్ ఖాన్ తన కూతురితో కలిసి ఈ కుట్రకు ప్లాన్ చేశాడు.

పోలీసుల కథనం ప్రకారం తండ్రీకూతుళ్లిద్దరూ కలిసి టాయిలెట్ క్లీనింగ్ యాసిడ్‌ను కొనుగోలు చేసి, దాడి జరిగినట్లు నాటకం సృష్టించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు లక్ష్మీబాయి కాలేజీ సమీపంలో జితేందర్, అతని స్నేహితులు బైక్‌పై వచ్చి యాసిడ్ పోశారని బాధితురాలు మొదట పోలీసులకు తెలిపింది. తన ముఖాన్ని కాపాడుకునే ప్రయత్నంలో చేతులకు గాయాలయ్యాయని చెప్పింది. గతంలో జితేందర్ తనను వేధించాడని, ఈ విషయమై వాగ్వాదం కూడా జరిగిందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, దాడి జరిగిన సమయంలో జితేందర్ కరోల్ బాగ్‌లోని ఓ పార్కింగ్‌లో ఉన్నట్లు తేలింది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి లోతుగా విచారణ చేపట్టగా, అకిల్ ఖాన్ నేరాన్ని అంగీకరించాడు. కాగా, అకిల్ ఖాన్‌కు, జితేందర్ స్నేహితులైన ఇషాన్, అర్మాన్‌ల కుటుంబానికి మధ్య ఆస్తి గొడవలు కూడా ఉన్నట్లు తెలిసింది. 2018లో తమపై అకిల్ బంధువులు యాసిడ్ దాడి చేశారని వారి తల్లి షబ్నం ఆరోపించారు. ప్రస్తుతం ఇషాన్, అర్మాన్‌లు ఆగ్రాలో ఉన్నారని, త్వరలోనే విచారణకు హాజరవుతారని పోలీసులు తెలిపారు.


More Telugu News