మొంథా ఎఫెక్ట్: కుప్పంలో 8 పరిశ్రమల శంకుస్థాపన వాయిదా

  • తుపాన్ కారణంగా వాయిదా వేసినట్లు ప్రకటన
  • సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జరగాల్సిన కార్యక్రమం
  • మొత్తం రూ.2,203 కోట్ల విలువైన ప్రాజెక్టులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పంలో జరగాల్సిన కీలక పారిశ్రామిక కార్యక్రమం వాయిదా పడింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరగాల్సిన 8 పరిశ్రమల శంకుస్థాపన కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 

కుప్పం నియోజకవర్గంలో మొత్తం రూ.2,203 కోట్ల పెట్టుబడితో 8 పరిశ్రమల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ పరిశ్రమలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయాల్సి ఉండగా, రాష్ట్రంలో తుపాన్ ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ఈ పరిశ్రమల ఏర్పాటు ద్వారా కుప్పం ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించిన తర్వాత శంకుస్థాపనకు సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


More Telugu News