AB de Villiers: వారిని వేధించొద్దు.. సెలబ్రేట్ చేసుకోండి: రో-కో విమర్శకులకు డివిలియర్స్ చురకలు

AB de Villiers roasts Rohit Kohli critics calls them cockroaches
  • రోహిత్, కోహ్లీలపై విమర్శలు చేస్తున్న వారిపై మండిపడ్డ ఏబీ డివిలియర్స్
  • విమర్శకులను 'బొద్దింకలు' అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించిన ఏబీడీ
  • ఆస్ట్రేలియాతో వన్డేలో రాణించిన రోహిత్, కోహ్లీ
  • దేశం కోసం ఆడిన దిగ్గజాలపై నెగెటివిటీ ఎందుకని ప్రశ్న
  • ఆటగాళ్ల కెరీర్‌ను విమర్శించడం కాదని, సెలబ్రేట్ చేసుకోవాలని సూచన
టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై విమర్శలు గుప్పిస్తున్న వారిపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. అలాంటి వారిని 'బొద్దింకలు' అంటూ అభివర్ణించిన ఆయన, దిగ్గజ ఆటగాళ్లపై అనవసరంగా ప్రతికూలతను రుద్దడం సరికాదని హితవు పలికాడు.

ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ శతకంతో, విరాట్ కోహ్లీ అజేయంగా 74 పరుగులు చేసి సత్తా చాటారు. దీంతో వారి ఫామ్‌పై, వన్డే జట్టులో వారి స్థానంపై వస్తున్న విమర్శలకు తాత్కాలికంగా తెరపడింది. ఈ నేపథ్యంలోనే డివిలియర్స్, తన ఫేస్‌బుక్ లైవ్ సెషన్‌లో రోహిత్, కోహ్లీలకు మద్దతుగా నిలిచాడు.

"ఆటగాళ్లు తమ కెరీర్ చివరి దశకు చేరుకోగానే విమర్శకులు బొద్దింకల్లా కలుగుల్లోంచి బయటకు వస్తారు. ఎందుకిలా? దేశం కోసం, ఈ అందమైన క్రికెట్ ఆట కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఆటగాళ్లపై ఎందుకు ప్రతికూల శక్తిని ప్రయోగిస్తారు? ఇది వారిని విమర్శించాల్సిన సమయం కాదు, వారి కెరీర్‌ను సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం" అని డివిలియర్స్ ఘాటుగా వ్యాఖ్యానించాడు.

గత కొన్ని నెలలుగా రోహిత్, కోహ్లీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారని గుర్తుచేశాడు. "కారణం ఏంటో తెలియదు. కానీ, ప్రతి ఒక్కరూ వారిని కిందికి లాగాలని ప్రయత్నిస్తున్నారు. అయితే విమర్శించేది కేవలం కొద్దిమంది మాత్రమే. ఎక్కువ మంది అభిమానులు రోహిత్, విరాట్‌ను, వారి అద్భుతమైన కెరీర్‌ను గౌరవిస్తారని నేను నమ్ముతున్నాను" అని ఆయన పేర్కొన్నాడు. దిగ్గజ ఆటగాళ్లకు అవ‌స‌ర‌మైన మద్దతు ఇవ్వకుండా, వారిపై నిరంతరం నెగెటివిటీని ప్రచారం చేయడం సరికాదని ఏబీ డివిలియర్స్ స్పష్టం చేశాడు.
AB de Villiers
Virat Kohli
Rohit Sharma
India cricket
Cricket criticism
South Africa cricket
Cricket legends
Cricket fans
ODI cricket
Sydney ODI

More Telugu News