కాకినాడ వైపు దూసుకొస్తున్న మొంథా తుపాను.. 17 జిల్లాలకు రెడ్ అలర్ట్

  • కాకినాడ సమీపంలో తీరం దాటనున్న మొంథా తుపాను
  • మరికొద్ది గంటల్లో తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం
  • ఏపీలోని 17 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
  • గంటకు 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు
  • ఉప్పాడ తీరంలో ధ్వంసమైన బీచ్ రోడ్డు, ఎగసిపడుతున్న అలలు
  • తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు
మొంథా తుపాను ఏపీ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. ఈరోజు సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో ఇది తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని 17 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కోస్తా జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు మొదలవడంతో యంత్రాంగం అప్రమత్తమైంది.

ప్రస్తుతం ఈ తుపాను కాకినాడకు 310 కిలోమీటర్ల దూరంలో, మచిలీపట్నానికి 230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో పయనిస్తున్న మొంథా, మరికొద్ది గంటల్లో తీవ్ర తుపానుగా బలపడనుందని అధికారులు తెలిపారు. తీరం దాటిన తర్వాత సుమారు 18 గంటల పాటు దీని ప్రభావం కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.

తుపాను కారణంగా తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, నెల్లూరు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 95 ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. విజయవాడలో 16 సెంటీమీటర్ల వర్షపాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉందని తెలిపింది.

కాకినాడ జిల్లాలో తుపాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఉప్పాడ తీరంలో సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. దీని ధాటికి ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. అలల తాకిడికి భారీ రాళ్లు రోడ్డుపైకి కొట్టుకువచ్చాయి. తీరప్రాంత గ్రామాల్లోని ఇళ్లు కోతకు గురవడంతో, స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇక కోనసీమ జిల్లా వ్యాప్తంగా అర్థరాత్రి నుంచే ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అధికారులు సముద్రానికి దగ్గరగా ఉన్న గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులు చేపట్టారు.


More Telugu News