Gautam Gambhir: నాకు అలాంటి లక్ష్యమేమీ లేదు: గంభీర్

Gautam Gambhir I have no such goal
  • విజయవంతమైన కోచ్ అవ్వాలని తనకు లేదన్న  గంభీర్
  • భారత జట్టును భయం లేని టీమ్‌గా చూడాలనుకుంటున్నానని వెల్లడి
  • కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ గురించి ఆందోళన లేదని వివరణ
  • తమది అల్ట్రా అగ్రెసివ్ ఆటతీరు అని స్పష్టం
టీమిండియా హెడ్ కోచ్‌గా అత్యంత విజయవంతమైన వ్యక్తిగా నిలవాలనే లక్ష్యం తనకు లేదని గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. తన వ్యక్తిగత రికార్డుల కన్నా, భారత జట్టును ప్రపంచంలోనే అత్యంత ధైర్యవంతమైన జట్టుగా తీర్చిదిద్దడమే తన ఏకైక లక్ష్యమని తేల్చి చెప్పాడు. ఆటగాళ్లు స్వేచ్ఛగా, దూకుడుగా ఆడే వాతావరణాన్ని సృష్టించడానికే ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నాడు.

ఆస్ట్రేలియాతో అక్టోబర్ 29 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్ నేపథ్యంలో, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌పై వస్తున్న విమర్శలపై గంభీర్ స్పందించాడు. జట్టు అనుసరిస్తున్న 'అల్ట్రా అగ్రెసివ్' ఆటతీరు వల్లే ఇలాంటి ఫలితాలు సహజమని, సూర్య ఫామ్ గురించి తాము ఏమాత్రం ఆందోళన చెందడం లేదని అన్నాడు. "నిజాయతీగా చెప్పాలంటే, మా డ్రెస్సింగ్ రూమ్‌లో దూకుడైన విధానానికి కట్టుబడి ఉన్నాం. సూర్యకుమార్ 30 బంతుల్లో 40 పరుగులు చేసి విమర్శల నుంచి తప్పించుకోవడం చాలా సులభం. కానీ, జట్టు కోసం వేగంగా ఆడే క్రమంలో విఫలమైనా ఫర్వాలేదనేది మా సమష్టి నిర్ణయం" అని గంభీర్ వివరించాడు.

టీ20 క్రికెట్‌లో వ్యక్తిగత పరుగుల కంటే ఆటగాడి ఇంపాక్టే తమకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశాడు. అభిషేక్ శర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని, సూర్య కూడా తన రిథమ్ అందుకుంటే జట్టును విజయపథంలో నడిపిస్తాడని గంభీర్ విశ్వాసం వ్యక్తం చేశాడు. సూర్యకుమార్ కెప్టెన్సీని ప్రశంసిస్తూ, గత ఏడాదిన్నరగా జట్టును సమర్థవంతంగా నడిపిస్తున్నాడని కొనియాడాడు.

"మేము ఓటమి భయంతో ఆడటం లేదు. జట్టు ఎలా ఆడాలో మా మధ్య పూర్తి అవగాహన ఉంది" అని గంభీర్ తెలిపాడు. జియోస్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. 
Gautam Gambhir
Team India
India head coach
Suryakumar Yadav
T20 series
ultra aggressive
Abhishek Sharma
Indian cricket team
cricket
T20

More Telugu News