రుణాలిచ్చే 'మనీవ్యూ' యాప్‌ నుంచి రూ. 49 కోట్లు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు

  • యాప్ ఏపీఐ సిస్టంలోకి చొరబడిన హ్యాకర్లు
  • మూడు గంటల వ్యవధిలో రూ.49 కోట్లు కొట్టేశారు
  • 653 నకిలీ ఖాతాల్లోకి డబ్బు బదిలీ
రుణాలు మంజూరు చేసే యాప్ 'మనీవ్యూ'కు సైబర్ నేరగాళ్లు సుమారు రూ.49 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టారు. ఈ యాప్ యొక్క ఏపీఐ (API) సిస్టంలోకి చొరబడిన హ్యాకర్లు కేవలం మూడు గంటల వ్యవధిలో దాదాపు రూ.49 కోట్లు కొల్లగొట్టారు. మనీవ్యూ యాప్, విజ్డమ్ ఫైనాన్స్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది. ఈ యాప్‌ను దుబాయ్, చైనా, హాంకాంగ్, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన సైబర్ హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారు.

యాప్‌నకు చెందిన ఏపీఐ కీని ఉపయోగించి మూడు గంటల వ్యవధిలో రూ.49 కోట్లను కొట్టేసి, వాటిని 653 నకిలీ ఖాతాలలోకి బదిలీ చేశారని బెంగళూరు సైబర్ క్రైమ్ బ్రాంచ్ వెల్లడించింది. దుబాయ్‌లోని భారత సంతతికి చెందిన ఒక వ్యక్తి, బెళగావికి చెందిన ఇస్మాయిల్ అనే వ్యక్తి వద్ద నుంచి వర్చువల్ ప్రైవేటు సర్వర్‌ను కొనుగోలు చేసి ఈ సైబర్ దాడికి పాల్పడినట్లు సమాచారం.

ఈ కేసులో ఇస్మాయిల్‌తో పాటు మహారాష్ట్రకు చెందిన మరొక వ్యక్తిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రకు చెందిన రెండో నిందితుడి పేరు మీద ఉన్న నకిలీ ఖాతాకు కూడా డబ్బు బదిలీ అయింది. ఇతర బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ అయిన రూ.10 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి దుబాయ్‌లో ముగ్గురిని, హాంకాంగ్‌లో ఇద్దరిని అనుమానితులుగా గుర్తించారు. వారిని గుర్తించేందుకు బెంగళూరు సీసీబీ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.


More Telugu News