మీ అల్లుడిని కంట్రోల్‌లో పెట్టుకోండి: కేసీఆర్‌కు మంత్రి లక్ష్మణ్ సూచన

  • హరీశ్ రావుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర విమర్శలు
  • కాంగ్రెస్ కేబినెట్‌ను 'దండుపాళ్యం బ్యాచ్' అనడంపై ఆగ్రహం
  • వెంటనే హరీశ్ రావు క్షమాపణ చెప్పాలని డిమాండ్
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హరీశ్ రావు నోటికి వచ్చినట్లు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ మంత్రివర్గాన్ని 'దండుపాళ్యం బ్యాచ్' అంటున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ వ్యాఖ్యలపై హరీశ్ రావు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

బలహీన వర్గాలకు చెందిన మంత్రులున్న కేబినెట్‌ను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని అడ్లూరి లక్ష్మణ్ ప్రశ్నించారు. "మా మంత్రివర్గం దండుపాళ్యం బ్యాచ్ అయితే, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రివర్గం స్టువర్ట్‌పురం దొంగల ముఠా లాంటిదా?" అని ఆయన నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల మంత్రులపై చేసిన ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, హరీశ్ రావు వెంటనే తన మాటలను వెనక్కి తీసుకోవాలని అన్నారు.

ఈ సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ మరికొన్ని సంచలన ఆరోపణలు చేశారు. "కేసీఆర్‌కు తెలియకుండానే గతంలో హరీశ్ రావు 28 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సొంతంగా ఫండింగ్ చేశారు. ఈ విషయం తెలియడం వల్లే రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా కేసీఆర్ వెంటనే ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు" అని ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో హరీశ్ రావు అవినీతికి పాల్పడ్డారని గతంలో కవిత చేసిన ఆరోపణలను గుర్తు చేస్తూ, దీనిపై చర్చకు రమ్మంటే ఆయన తోక ముడిచారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను చర్చకు పంపుతానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తాము అంబేద్కర్ విగ్రహం వద్ద చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. చివరగా, "కేసీఆర్ గారూ.. దయచేసి మీ అల్లుడిని కంట్రోల్‌లో పెట్టుకోండి" అని అడ్లూరి లక్ష్మణ్ హితవు పలికారు. 


More Telugu News