విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా సత్యప్రమాణం చేసిన జోగి రమేశ్.. చంద్రబాబు, లోకేశ్‌కు సవాల్

  • నకిలీ మద్యం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని జోగి రమేశ్ స్పష్టీకరణ
  • కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చిన మాజీ మంత్రి
  • లైడిటెక్టర్, నార్కో అనాలసిస్ టెస్టులకు తాను సిద్ధమని ప్రకటన
  • తన వ్యక్తిత్వాన్ని హననం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపణ
  • తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారు సత్యప్రమాణానికి సిద్ధమా? అని సవాల్
నకిలీ మద్యం కేసులో తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో సత్యప్రమాణం చేసి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు.

కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రికి చేరుకున్న ఆయన, ఘాట్‌ రోడ్డు ప్రవేశద్వారం వద్ద చేతిలో దీపం వెలిగించి, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జోగి రమేశ్ మాట్లాడుతూ.. "నా వ్యక్తిత్వంపై నింద వేశారు. నా మనసును గాయపరిచారు. అందుకే కుటుంబంతో సహా వచ్చి, ఏ తప్పు చేయలేదని అమ్మవారి ఎదుట నిండు మనసుతో ప్రమాణం చేశాను. నా కుటుంబాన్ని అవమానించిన వారికి అమ్మవారు మంచి బుద్ధి ప్రసాదించాలి" అని అన్నారు.

గతంలో తాను చెప్పినట్లే తిరుపతి వెంకన్న, బెజవాడ దుర్గమ్మపై ప్రమాణానికి కట్టుబడి ఉన్నానని, అందులో భాగంగానే ఇప్పుడు ప్రమాణం చేశానని తెలిపారు. నకిలీ మద్యం కేసులో నార్కో అనాలసిస్, లైడిటెక్టర్ టెస్టులకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని పునరుద్ఘాటించారు.

ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. "నాపై తప్పుడు ఆరోపణలు చేసిన వారు సత్యప్రమాణానికి సిద్ధమా? కనీసం లైడిటెక్టర్‌ టెస్టుకైనా వచ్చే దమ్ముందా? కనకదుర్గమ్మ సాక్షిగా నేను తప్పు చేసినట్లు నిరూపించాలి" అని సవాల్ విసిరారు.


More Telugu News