విచారణ త్వరగా పూర్తి చేయండి.. ఉరిశిక్ష వేసినా సమ్మతమే.. కోర్టుకు దర్శన్ లాయర్ విజ్ఞప్తి

  • బెయిల్ కోసం 20 సార్లు పిటిషన్ దాఖలు
  • తమ వాదనలను పరిగణనలోకి తీసుకోలేదన్న దర్శన్ లాయర్
  • విచారణ పూర్తి చేసి ఉరిశిక్ష వేసినా సమ్మతమేనని కోర్టుకు వెల్లడి
అభిమాని హత్య కేసులో జైలుపాలైన కన్నడ నటుడు దర్శన్ జైలులో తనకు కనీస సదుపాయాలు కూడా కల్పించడం లేదని వాపోయాడు. విచారణ జరుగుతున్న క్రమంలో బెయిల్ కోసం 20 సార్లు పిటిషన్లు పెట్టుకున్నా పరిగణనలోకి తీసుకోలేదని చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల్లో తనను జైలులో ఉంచడం కన్నా విచారణ త్వరగా పూర్తిచేసి ఉరిశిక్ష వేసినా సరేనని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు దర్శన్ తరపు న్యాయవాది సునీల్‌ తాజాగా కోర్టులో వాదనలు వినిపించారు.

జైలులో తన క్లయింట్ కు ఖైదీలకు అందించాల్సిన కనీస సదుపాయాలు కూడా కల్పించడంలేదని ఆయన తెలిపారు. దర్శన్ కు జైలులో తగిన ఏర్పాట్లు చేయాలని ఎన్నిమార్లు విన్నవించుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. జైలులో కనీస సౌకర్యాలు కల్పించకుండా, కోర్టులో బెయిల్ లభించక తన క్లయింట్ తీవ్ర మనోవేదన కు గురవుతున్నారని ఆయన కోర్టుకు తెలియజేశారు.

విచారణను త్వరగా పూర్తి చేసి శిక్ష విధిస్తే అనుభవించడానికి దర్శన్‌ సిద్ధంగా ఉన్నాడని ఆయన పేర్కొన్నారు. వెన్నునొప్పి సమస్య తిరగబెట్టిందని, తనకు సైనేడ్‌ ఇస్తే తిని ఆత్మహత్య చేసుకుంటానని దర్శన్‌ గతంలో చేసిన వ్యాఖ్యలను న్యాయవాది సునీల్ ఈ సందర్భంగా కోర్టుకు గుర్తు చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసి తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.


More Telugu News