కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలతో విజయ్ సమావేశం

  • మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌ లో బాధితులను కలిసిన టీవీకే చీఫ్
  • బాధితులతో మాట్లాడి ఓదార్చిన నటుడు
  • ప్రత్యేక బస్సుల్లో రిసార్ట్ కు బాధితుల తరలింపు
తమిళనాడులోని కరూర్ లో తమిళిగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన తర్వాత బాధిత కుటుంబాలను వీడియో కాల్ లో పరామర్శించిన విజయ్.. త్వరలోనే వారిని కలుసుకుంటానని అప్పట్లో హామీ ఇచ్చారు. తాజాగా సోమవారం బాధిత కుటుంబాలను చెన్నైకి పిలిపించుకుని వారితో సమావేశం అయ్యారు. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి బాధిత కుటుంబ సభ్యులను చెన్నైలోని మహాబలిపురంలో ఉన్న ఓ రిసార్టుకు తరలించారు. ఈ సమావేశం కోసం టీవీకే పార్టీ రిసార్ట్ లోని 50 గదులను బుక్ చేసినట్లు సమాచారాం.

సెప్టెంబర్‌ 27న విజయ్‌ కరూర్‌లో నిర్వహించిన ప్రచార సభ తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఇక్కడ జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా.. 60 మందికిపైగా గాయపడ్డారు. తొక్కిసలాట జరిగిన వెంటనే విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన ప్రతి కుటుంబానికి టీవీకే తరఫున రూ. 20 లక్షల పరిహారాన్ని కూడా ప్రకటించారు. కరూర్ వెళ్లి బాధిత కుటుంబాలను స్వయంగా ఓదార్చేందుకు విజయ్ ప్రయత్నించారు.

అయితే, ఇందుకు అనుమతి లభించని కారణంగా బాధిత కుటుంబాలనే చెన్నైకి పిలిపించి ఓ రిసార్ట్ లో వారితో భేటీ అయ్యారు. కాగా, విజయ్ తమను కరూర్ వచ్చి కలవకుండా, చెన్నైకి రప్పించడంపై కొందరు బాధితుల కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది తమ నేత కలుసుకోవాల్సిన బాధ్యతగా కాకుండా, ప్రైవేట్ ఈవెంట్‌గా భావించడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.


More Telugu News