Sandhya: ప్రియుడి మోజులో దారుణం.. భర్తను చంపి బాత్రూంలో పడేసిన భార్య

Meerpet woman murders husband for extramarital affair
  • వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్త హత్య
  • ప్రియుడి కోసం భర్తను అంతమొందించిన భార్య సంధ్య
  • హత్యను ప్రమాదంగా నమ్మించేందుకు విఫలయత్నం
  • బకెట్ తాడుకు ఉన్న రక్తంతో గుట్టురట్టయిన దారుణం
  • మృతుడి తల్లి అనుమానంతో వెలుగులోకి వచ్చిన నిజం
  • నిందితురాలిని అరెస్ట్ చేసిన మీర్‌పేట్ పోలీసులు
నగరంలోని మీర్‌పేట్‌లో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో కట్టుకున్న భర్తనే ఓ భార్య అతికిరాతకంగా హతమార్చింది. అనంతరం ప్రమాదవశాత్తు చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ, చివరకు పోలీసులకు చిక్కింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్‌పేట్‌ పరిధిలోని జిల్లెలగూడ ప్రగతినగర్ కాలనీలో అల్లంపల్లి విజయకుమార్ (42), సంధ్య దంపతులు ముగ్గురు పిల్లలతో నివాసముంటున్నారు. విజయకుమార్ ఆటో నడుపుతుండగా, సంధ్య మీర్‌పేట్ మునిసిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో సంధ్య తన సహోద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇటీవల విజయకుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి మునిసిపల్ కార్యాలయానికి వెళ్లి సదరు ఉద్యోగిని హెచ్చరించినట్లు తెలిసింది.

భర్త తన బంధానికి అడ్డువస్తున్నాడని భావించిన సంధ్య, అతడిని ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకుంది. పథకం ప్రకారం ఈ నెల 20వ తేదీన (సోమవారం) నీళ్లు తోడే బకెట్‌కు ఉన్న తాడును భర్త మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఆపై కర్రతో తలపై కొట్టి, ప్రమాదంలా కనిపించేందుకు మృతదేహాన్ని బాత్రూమ్ వద్ద పడేసింది. భర్త ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయాడని కుటుంబ సభ్యులను నమ్మించింది. వారు వెంటనే డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి తరలించగా, విజయకుమార్ అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా అసలు విషయం బయటపడింది. బకెట్ తాడుకు రక్తం మరకలు ఉండటాన్ని మృతుడి తల్లి సత్తెమ్మ, స్థానికులు గమనించారు. దీంతో వారికి అనుమానం వచ్చి వెంటనే మీర్‌పేట్ పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదికలో మెడకు తాడు బిగించడం వల్లే విజయకుమార్ చనిపోయినట్లు తేలింది. దీంతో పోలీసులు సంధ్యను అదుపులోకి తీసుకుని విచారించగా, ఆమె నేరం అంగీకరించినట్లు సమాచారం.
Sandhya
Murder
Extra marital affair
Meerpet
Husband murder
Telangana crime
Illicit relationship
Crime news
Hyderabad crime

More Telugu News