Indian Citizens: మయన్మార్‌ సైబర్‌ కేంద్రాలపై దాడులు.. థాయిలాండ్‌కు పారిపోయిన వందలాది భారతీయులు

Hundreds of Indians flee Myanmar cyber crackdown to Thailand
  • మయన్మార్‌ సైబర్‌ కేంద్రాలపై సైనిక దాడుల భయం
  • సరిహద్దు దాటి థాయిలాండ్‌కు పారిపోయిన వెయ్యి మంది బాధితులు
  • వీరిలో 399 మంది భారతీయులు ఉన్నట్లు గుర్తింపు
  • థాయ్ మీడియా కథనాలతో వెలుగులోకి వచ్చిన ఘటన
  • ఉద్యోగాల పేరుతో నిర్బంధించి నేరాలు చేయిస్తున్న ముఠాలు
మయన్మార్‌లోని సైబర్‌క్రైమ్‌ కేంద్రాలపై ఆ దేశ సైన్యం దాడులు చేయనుందన్న హెచ్చరికలతో భారీ కలకలం రేగింది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి సరిహద్దు దాటి థాయిలాండ్‌కు పారిపోయిన వెయ్యి మందికి పైగా బాధితుల్లో వందలాది మంది భారతీయులు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అంతర్జాతీయ ఒత్తిడి పెరగడంతో, సైబర్‌ నేరాలకు అడ్డాగా మారిన 'కేకే పార్క్‌'పై సైనిక చర్యలు తప్పవని గత సోమవారం మయన్మార్‌ జుంటా ప్రభుత్వం ప్రకటించింది.

ఈ ప్రకటన వెలువడిన వెంటనే, బుధవారం నుంచి శుక్రవారం మధ్యలో సుమారు వెయ్యి మందికి పైగా వ్యక్తులు మయన్మార్‌ సరిహద్దు దాటి థాయిలాండ్‌లోని మాయిసోట్ జిల్లాలోకి ప్రవేశించారు. వీరిలో 399 మంది భారతీయులు, 147 మంది చైనీయులు, 31 మంది థాయ్‌ జాతీయులు ఉన్నారని థాయిలాండ్‌కు చెందిన 'ఖావ్‌సోద్‌' అనే దినపత్రిక తన కథనంలో పేర్కొంది. ఈ విషయాన్ని థాయిలాండ్‌ అధికారులు కూడా ధ్రువీకరించారు.

మయన్మార్‌లో కేకే పార్క్‌ వంటి భారీ కాంపౌండ్‌లను అడ్డాగా చేసుకుని అంతర్జాతీయ సైబర్‌ ముఠాలు ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నాయి. ఉద్యోగాల పేరుతో ఆకర్షించి, వేలాది మందిని ఇక్కడ నిర్బంధించి సాయుధ సిబ్బంది పర్యవేక్షణలో బలవంతంగా నేరాలు చేయిస్తున్నాయి. బాధితుల్లో భారత్‌తో పాటు వియత్నాం, ఫిలిప్పీన్స్‌, ఇథియోపియా, పాకిస్థాన్‌, ఇండోనేసియా, నేపాల్‌కు చెందిన వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు.

ఇలాంటి సైబర్‌ మోసాల బారిన పడిన భారతీయులను కాపాడటం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది మార్చి నెలలో కూడా మయన్మార్‌-థాయిలాండ్‌ సరిహద్దుల్లోని సైబర్‌ కేంద్రాలపై దాడులు నిర్వహించి 549 మంది భారత పౌరులను రక్షించారు. వీరిని రెండు ప్రత్యేక సైనిక విమానాల్లో భారత్‌కు తరలించిన విషయం తెలిసిందే. తాజా ఘటనతో ఈ ప్రాంతంలో సైబర్‌ బానిసత్వం సమస్య మరోసారి తీవ్రరూపం దాల్చింది.
Indian Citizens
Myanmar Junta
Myanmar cyber crime
KK Park Myanmar
Thailand
cyber fraud
online scams
cyber slavery
cyber attacks
Maysot district

More Telugu News