Salman Khan: సల్మాన్ ఖాన్‌ను పాక్ టెర్రరిస్ట్‌గా ప్రకటించిందా? వాస్తవం ఇదే!

Pakistan Government Denies Declaring Salman Khan a Terrorist
  • పాక్ టెర్రరిస్ట్ జాబితాలో సల్మాన్ ఖాన్ పేరు చేర్చారన్న వార్తలు
  • బలూచిస్థాన్‌పై సల్మాన్ చేసిన వ్యాఖ్యలే కారణమంటూ ప్రచారం
  • ఇది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసిన పాకిస్థాన్ ప్రభుత్వం
  • ఉగ్రవాదుల జాబితాలో సల్మాన్ పేరు లేదని అధికారిక వెల్లడి
  • సంచలనం కోసమే తప్పుడు కథనాలు సృష్టించారని ఆరోపణ
  • సౌదీ అరేబియాలో జరిగిన ఓ కార్యక్రమంలో సల్మాన్ వ్యాఖ్యలు
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను పాకిస్థాన్ ప్రభుత్వం టెర్రరిస్ట్‌గా ప్రకటించిందంటూ ఆదివారం పలు మీడియా సంస్థల్లో వచ్చిన వార్తలు తీవ్ర కలకలం రేపాయి. బలూచిస్థాన్‌పై ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారని, దేశ యాంటీ-టెర్రరిజం చట్టంలోని 'ఫోర్త్ షెడ్యూల్'లో ఆయన పేరు చేర్చారని ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని పాకిస్థాన్ ప్రభుత్వమే స్వయంగా స్పష్టం చేసింది. ఇది పూర్తిగా నిరాధారమైన, తప్పుడు ప్రచారం అని తేలిపోయింది.

పాకిస్థాన్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ వార్తలను తీవ్రంగా ఖండించింది. తమ అధికారిక ఎక్స్ (X) ఖాతా ద్వారా ఈ విషయంపై ఫ్యాక్ట్ చెక్ వివరాలను విడుదల చేసింది. సల్మాన్ ఖాన్‌ను టెర్రరిస్ట్‌గా ప్రకటించారన్న వార్త అవాస్తవమని, సంచలనం కోసమే ఇలాంటి తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. పాకిస్థాన్ జాతీయ కౌంటర్ టెర్రరిజం అథారిటీ (NCTA) విడుదల చేసే నిషేధిత వ్యక్తుల జాబితాలో గానీ, హోం మంత్రిత్వ శాఖ గెజిట్‌లో గానీ సల్మాన్ ఖాన్ పేరు ఎక్కడా నమోదు కాలేదని స్పష్టమైంది.

అసలేం జరిగింది?
ఇటీవల సౌదీ అరేబియాలోని రియాద్‌లో 'జాయ్ ఫోరమ్ 2025' అనే కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు సల్మాన్ ఖాన్‌తో పాటు షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ కూడా హాజరయ్యారు. అక్కడ మధ్యప్రాచ్యంలో భారత సినిమాల ప్రభావం గురించి సల్మాన్ మాట్లాడుతూ.. "ఇక్కడ చాలా దేశాల వారు పనిచేస్తున్నారు. బలూచిస్థాన్ నుంచి వచ్చిన వారు ఉన్నారు, అఫ్గానిస్థాన్ నుంచి వచ్చిన వారు ఉన్నారు, పాకిస్థాన్ నుంచి వచ్చిన వారు ఉన్నారు.. అందరూ ఇక్కడ పనిచేస్తున్నారు" అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల్లో ఆయన పాకిస్థాన్, బలూచిస్థాన్‌లను వేర్వేరుగా ప్రస్తావించడమే ఈ తప్పుడు ప్రచారానికి కారణమైంది.

ఏమిటీ 'ఫోర్త్ షెడ్యూల్'?
పాకిస్థాన్ యాంటీ-టెర్రరిజం యాక్ట్ (1997) ప్రకారం, 'ఫోర్త్ షెడ్యూల్' అనేది ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయని అనుమానించే వ్యక్తుల జాబితా. ఈ జాబితాలో చేర్చిన వారిపై కఠిన నిఘా ఉంటుంది, వారి ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తారు. చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇంతటి తీవ్రమైన జాబితాలో సల్మాన్ పేరు చేర్చారంటూ వచ్చిన వార్తలు ఒక్కసారిగా సంచలనంగా మారాయి.
Salman Khan
Bollywood
Pakistan
Balochistan
Terrorist
Joy Forum 2025
Saudi Arabia
Shahrukh Khan
Aamir Khan

More Telugu News