Cyclone Montha: తెలంగాణపై 'మొంథా' తుపాను ప్రభావం.. రెండు రోజులు కుండపోత వర్షాలు

Cyclone Montha effect on Telangana heavy rains expected
  • బంగాళాఖాతంలో మొంథా తుపాను.. తెలంగాణపై ప్రభావం
  • రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
  • ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలకు తీవ్ర హెచ్చరిక
  • భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెంలో అత్యంత భారీ వర్ష సూచన
  • రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
  • లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి
బంగాళాఖాతంలో ఏర్పడిన 'మొంథా' తుపాను ప్రభావంతో తెలంగాణలో రానున్న రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భార‌త‌ వాతావరణ శాఖ‌ హెచ్చరించింది. రేపు, ఎల్లుండి తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ముఖ్యంగా తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలపై తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని స్పష్టం చేసింది. 

మంగ‌ళ‌వారం రాత్రి ఏపీలోని కాకినాడ స‌మీపంలో ఈ తుపాను తీరం దాటే అవ‌కాశాలు ఉన్న‌ట్లు పేర్కొంది. దీని ప్ర‌భావంతో  మంగ‌ళ‌, బుధ‌వారాల్లో రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో కుండ‌పోత వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. 5 సెం.మీ. నుంచి 20 సెం.మీ. వ‌ర‌కు వ‌ర్షపాతం న‌మోద‌య్యే ఛాన్స్ ఉంద‌ని హెచ్చ‌రించింది. ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేసింది.

వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం, రేపు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని, రెడ్ అల‌ర్ట్ జారీ చేసింది. ఇదే రోజున కొమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఓ మోస్త‌రు వర్షాలు నమోదవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ నేప‌థ్యంలో ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేశారు. 

ఎల్లుండి కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయని తెలిపింది. తుపాను తీవ్రత దృష్ట్యా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, జిల్లా యంత్రాంగాలు పూర్తి సన్నద్ధతతో ఉండాలని సూచనలు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు కోరారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటలను కాపాడుకోవడానికి రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది. మత్స్యకారులు రెండు రోజుల పాటు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. మొంథా తుపాను కదలికలను నిరంతరం గమనిస్తున్నామని, ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తామని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
Cyclone Montha
Telangana rains
heavy rainfall
weather forecast
IMD
Hyderabad weather
red alert
orange alert
Montha cyclone effect
Telangana districts

More Telugu News