విద్యార్థిని వాట్సాప్, ఫొటో గ్యాలరీ చెక్ చేసిన ప్రిన్సిపాల్ పై వేటు

  • స్కూల్‌కు ఫోన్ తెచ్చిన విద్యార్థినిపై ప్రిన్సిపాల్ చర్య
  • అమ్మాయి ఫోన్ లాక్కొని వాట్సాప్, గ్యాలరీ చెక్
  • విద్యార్థిని గోప్యతకు భంగం కలిగించారని తల్లిదండ్రుల ఆందోళన
  • విద్యాశాఖకు ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశం
  • విచారణలో తప్పు అంగీకరించిన ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసిన అధికారులు
పాఠశాలకు ఫోన్ తీసుకొచ్చిన ఓ విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించిన ప్రిన్సిపాల్‌పై రాజస్థాన్ విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. విద్యార్థిని వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించారనే ఆరోపణలతో జోధ్‌పూర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాల యాక్టింగ్ ప్రిన్సిపాల్‌ను శనివారం సస్పెండ్ చేశారు.

వివరాల్లోకి వెళితే, జోధ్‌పూర్‌లోని పీఎం శ్రీ మహాత్మా గాంధీ ప్రభుత్వ పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని శనివారం స్కూల్‌కు మొబైల్ ఫోన్ తీసుకొచ్చింది. ఈ విషయం గమనించిన యాక్టింగ్ ప్రిన్సిపాల్ షకీల్ అహ్మద్, ఆమె నుంచి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఫోన్ లాక్ తీసి, అందులోని వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలతో పాటు కాల్ వివరాలు, గ్యాలరీని కూడా తనిఖీ చేశారు. అంతేకాకుండా, క్లాసులో ఆమె పక్కన కూర్చునే అబ్బాయి గురించి కూడా ప్రశ్నించినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థిని, విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేసింది. వెంటనే పాఠశాలకు చేరుకున్న కుటుంబసభ్యులు, ప్రిన్సిపాల్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఫోన్‌లో ఏవైనా వ్యక్తిగత వివరాలు ఉంటే ప్రిన్సిపాల్ వాటిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని ఆరోపిస్తూ విద్యాశాఖకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఉన్నతాధికారులు వెంటనే స్పందించి విచారణకు ఆదేశించారు. విచారణలో ప్రిన్సిపాల్ షకీల్ అహ్మద్ తన తప్పును అంగీకరించారు. పాఠశాలలో పరీక్షలు జరుగుతున్నందున, విద్యార్థిని రీల్స్ ఏమైనా రికార్డ్ చేసిందేమోననే అనుమానంతోనే ఫోన్ చెక్ చేశానని తన రాతపూర్వక వాంగ్మూలంలో పేర్కొన్నారు. అయితే, ఆయన చర్య విద్యార్థిని గోప్యతకు భంగం కలిగించడమేనని నిర్ధారించిన సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్, తక్షణమే సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.


More Telugu News