దొంగలతో పోరాడిన డీసీపీ చైతన్య ధైర్యం అమోఘం: డీజీపీ శివధర్‌రెడ్డి

  • దొంగలను పట్టుకునే క్రమంలో గాయపడిన డీసీపీ చైతన్యకుమార్
  • యశోదా ఆసుపత్రిలో డీసీపీని పరామర్శించిన డీజీపీ శివధర్‌రెడ్డి
  • డీసీపీ ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడి
  • చైతన్యకుమార్, గన్‌మ్యాన్ ధైర్యసాహసాలను కొనియాడిన డీజీపీ
  • కత్తితో దాడి చేసిన దొంగపై ఆత్మరక్షణ కోసం కాల్పులు
  • గాయపడిన దొంగ ఒమర్ అన్సారీకి కూడా చికిత్స
చాదర్‌ఘాట్‌లో సెల్‌ఫోన్ దొంగలను పట్టుకునే ప్రయత్నంలో గాయపడిన డీసీపీ చైతన్యకుమార్‌ను, ఆయన గన్‌మ్యాన్‌ను తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌తో కలిసి సోమాజిగూడలోని యశోదా ఆసుపత్రికి వెళ్లిన ఆయన, చికిత్స పొందుతున్న డీసీపీ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీసీపీ చైతన్యకుమార్‌తో మాట్లాడారు.

ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడిన డీజీపీ శివధర్‌రెడ్డి, డీసీపీ చైతన్యకుమార్ ఆరోగ్యం నిలకడగా ఉందని, మెరుగుపడుతోందని తెలిపారు. "సోమవారం ఆయన్ను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. డీసీపీ చైతన్యకుమార్ ఒక ఆదర్శవంతమైన అధికారి. విధి నిర్వహణలో భాగంగా ఆయన చూపిన చొరవ, ధైర్యసాహసాలు ప్రశంసనీయం. దొంగ చేతిలో కత్తి ఉందని తెలిసినా వెనకడుగు వేయకుండా అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆయనతో పాటు గన్‌మ్యాన్ కూడా అంతే ధైర్యాన్ని ప్రదర్శించారు. పోలీస్ శాఖ తరపున వారిద్దరినీ అభినందిస్తున్నాం" అని డీజీపీ పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ ప్రాంతంలో సెల్‌ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న ఒమర్ అన్సారీ అనే వ్యక్తిని పట్టుకోవడానికి డీసీపీ చైతన్యకుమార్ స్వయంగా రంగంలోకి దిగారు. ఈ క్రమంలో నిందితుడు కత్తితో డీసీపీపై దాడికి యత్నించాడు. ఆత్మరక్షణ కోసం డీసీపీ కాల్పులు జరపగా, నిందితుడు గాయపడ్డాడు. ఈ ఘటనలో డీసీపీతో పాటు ఆయన గన్‌మ్యాన్‌కు కూడా స్వల్ప గాయాలయ్యాయి.

గాయపడిన దొంగ ఒమర్ అన్సారీకి కూడా ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగిందని, ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడని డీజీపీ తెలిపారు. చైతన్యకుమార్‌ వంటి అధికారుల వల్లే సమాజంలో భద్రతాభావం పెరుగుతుందని, వారి చర్యలు పోలీస్ బలగాలకు స్ఫూర్తినిస్తాయని శివధర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.


More Telugu News