మావోయిస్టు అగ్రనేత హిడ్మా లొంగుబాటుకు రంగం సిద్ధం?

  • తెలంగాణలో లొంగిపోయే అవకాశం ఉందని నిఘా వర్గాల అంచనా
  • ఇటీవలే వరంగల్‌లో లొంగిపోయిన హిడ్మా కుమార్తె కేశా
  • హిడ్మా లొంగుబాటు వార్తలను ఖండించిన ఛత్తీస్‌గఢ్ పోలీసులు
  • అనుచరులతో కలిసి హిడ్మా ఆయుధాలు అప్పగించే అవకాశం
  • ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు గిరిజనులను హత్య చేసిన మావోయిస్టులు
మావోయిస్టు పార్టీ అగ్ర నాయకుడు, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి మడావి హిడ్మా అలియాస్ సంతోష్ లొంగిపోతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తన అనుచరులతో కలిసి తెలంగాణ పోలీసుల ఎదుట హిడ్మా ఆయుధాలు అప్పగించే అవకాశాలున్నాయని రాష్ట్ర నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ప్రచారాన్ని ఛత్తీస్‌గఢ్ పోలీసులు తోసిపుచ్చుతున్నప్పటికీ, తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలు మాత్రం ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవడం లేదు.

పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) ప్లాటూన్-1 కమాండర్‌గా, కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న హిడ్మా.. గెరిల్లా దాడుల వ్యూహరచనలో అత్యంత నిపుణుడిగా పేరుగాంచాడు. గతంలో భద్రతా బలగాలపై జరిగిన అనేక భారీ దాడులకు హిడ్మానే నాయకత్వం వహించాడని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మా, వందలాది మంది గిరిజన యువతను మావోయిస్టు పార్టీలో చేర్పించి, వారికి సాయుధ శిక్షణ ఇచ్చి పటిష్టమైన సైన్యాన్ని నిర్మించాడు. మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న అతడు పలుమార్లు పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నాడు.

ఇటీవల కాలంలో సోనూ, ఆశన్న వంటి కీలక నేతలతో పాటు వందల మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే హిడ్మా కుమార్తె వంజెం కేశా అలియాస్ జిన్నీ సైతం వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. 'ఆపరేషన్ కగార్' తీవ్రం కావడంతో ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు హిడ్మా సైతం లొంగిపోవడానికి సిద్ధమవుతున్నారని, వరంగల్‌లో లొంగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.

ఇద్దరు గిరిజనుల దారుణ హత్య
మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసు ఇన్ఫార్మర్ల నెపంతో కాంకేర్ గ్రామానికి చెందిన సోది తిరుపతి (35), కట్టం రవి (25) అనే ఇద్దరు గిరిజనులను శుక్రవారం రాత్రి దారుణంగా హత్య చేశారు. మాట్లాడాలని ఇంటి నుంచి బయటకు పిలిచి, కత్తులతో పొడిచి చంపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది.


More Telugu News