మద్యం టెండర్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్.. లాటరీకి మాత్రం గ్రీన్ సిగ్నల్!

  • లాటరీ ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ
  • గడువు పెంచాక వచ్చిన దరఖాస్తులు తుది తీర్పునకు లోబడే
  • బంద్ కారణంగానే గడువు పెంచామని ప్రభుత్వ వాదన
  • నిబంధనలకు విరుద్ధంగా గడువు పొడిగించారని పిటిషనర్ల ఆరోపణ
  • పిటిషనర్లలో కొందరు గడువు పెంచాక దరఖాస్తు చేశారన్న ప్రభుత్వం
తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్‌ల దరఖాస్తు గడువు పెంపుపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు తన తీర్పును రిజర్వు చేసింది. అయితే, లాటరీ ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన ధర్మాసనం, గడువు పొడిగించాక అంటే ఈనెల 19 నుంచి 23 మధ్య వచ్చిన దరఖాస్తుల భవిష్యత్తు మాత్రం తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది.

మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకు పెంచుతూ ఎక్సైజ్‌శాఖ కమిషనర్ జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ పలువురు దరఖాస్తుదారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్. తుకారాంజీ ధర్మాసనం శనివారం విచారణ చేపట్టింది.

ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్‌ వాదనలు వినిపిస్తూ.. మద్యం అమ్మకాలపై ప్రభుత్వానికి పూర్తి హక్కు ఉంటుందన్నారు. దరఖాస్తుల చివరి రోజైన 18న బీసీ సంఘాలు బంద్ నిర్వహించడం వల్లే ఎవరికీ ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో గడువును పొడిగించామని, ఇది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని కోర్టుకు తెలిపారు. పిటిషనర్లలో కొందరు గడువు ముగిశాక దరఖాస్తు చేసి, ఇప్పుడు కోర్టును ఆశ్రయించడం దురుద్దేశంతో కూడుకున్నదేనని వాదించారు.

పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదిస్తూ.. గడువు పొడిగింపు 2012 ఎక్సైజ్ నిబంధనలను ఉల్లంఘించడమేనని తెలిపారు. దరఖాస్తుకు రూ.3 లక్షల నాన్-రిఫండబుల్ ఫీజు ఉంటుందని, గడువు పెంచడం వల్ల దరఖాస్తుల సంఖ్య పెరిగి, లాటరీలో గెలిచే అవకాశాలు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాలా, వద్దా అనేదే ఇక్కడ కీలక అంశమని వ్యాఖ్యానించింది. ఈ అంశంపై తుది తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది. అప్పటివరకు కొత్త దరఖాస్తుల కేటాయింపులు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.


More Telugu News