మీకు అధికారం కావాలేమో... మాకు అది కూడా అవసరం లేదు: కేతిరెడ్డిపై మంత్రి సత్యకుమార్ ఫైర్

  • వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం
  • కేతిరెడ్డి 3.0 వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన సత్యకుమార్
  • కూటమి కార్యకర్తలకు గుండు సూది గుచ్చాలని చూసినా గునపాలు దిగుతాయని హెచ్చరించిన సత్యకుమార్
వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఇటీవల చేసిన 3.0 వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత, ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. కేతిరెడ్డికి ఆయన సీరియస్ హెచ్చరిక జారీ చేశారు. కూటమి కార్యకర్తలకు హాని కలిగించే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

కూటమి కార్యకర్తలకు గుండు సూది గుచ్చాలని చూసినా గునపాలు దిగుతాయని సత్యకుమార్ హెచ్చరించారు. ప్రస్తుతానికి మౌనంగా ఉన్నామని, ఇలాగే మాట్లాడితే ఉపేక్షించే పరిస్థితి ఉండదని అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏదైనా చేస్తే ఎవరూ ఊళ్ళో ఉండలేరని సూటిగా చెప్పారు.

మీకు అధికారం కావాలేమో కానీ మాకు అది కూడా అవసరం లేదని సత్యకుమార్ అన్నారు. ప్రజల జోలికి వస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని సత్యకుమార్ హెచ్చరించారు. మీ కార్యకర్తలు పార్టీని వీడుతుంటే బ్రతిమిలాడుకోవడం తప్పేమీ కాదని అన్నారు. వైసీపీ నేతల తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. 

తాము తలుచుకుంటే కేతిరెడ్డి విదేశీ పర్యటనలకు కూడా వెళ్లలేరని అన్నారు. ఇప్పటికైనా అవాకులు చెవాకులు పేలడం మానుకోవాలని, లేకపోతే ఇప్పుడున్న 11 సీట్లు కూడా రానున్న రోజుల్లో ఉండవని అన్నారు. ఎవరికి దీపావళి, దసరా ఉండదో చూపిస్తామని సత్యకుమార్ కౌంటర్ ఇచ్చారు. 


More Telugu News