‘మొంథా’ తుపాను వస్తోంది... అప్రమత్తంగా ఉండండి: సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

  • 'మొంథా' తుపాను ముప్పుతో ఏపీకి రెడ్ అలెర్ట్ జారీ
  • అధికారులతో సీఎం చంద్రబాబు అత్యవసర టెలీకాన్ఫరెన్స్
  • ఈ నెల 28న కాకినాడ వద్ద తీరం దాటనున్న తుపాను
  • గంటకు 110 కి.మీ వేగంతో పెనుగాలులు వీచే అవకాశం
  • ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశం
  • తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచన
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంపై 'మొంథా' తుపాను విరుచుకుపడనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. యూఏఈ పర్యటన నుంచి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, తుపాను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారు. ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడటమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు.

వాతావరణ శాఖ జారీ చేసిన రెడ్ అలెర్ట్‌ను ప్రస్తావిస్తూ, ఈ నెల 26, 27, 28, 29 తేదీల్లో తుపాను ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉంటుందని సీఎం తెలిపారు. ముఖ్యంగా ఈ నెల 28వ తేదీ సాయంత్రం కాకినాడ సమీపంలో 'మొంథా' తీవ్ర తుపానుగా తీరం దాటుతుందని, ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని అంచనా వేస్తున్నట్లు వివరించారు. దీని ప్రభావం శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఉంటుందని, 80 నుంచి 100 మిల్లీమీటర్ల మేర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ఇప్పటి నుంచే సమగ్ర సన్నాహక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

"ఈ విపత్తు సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడటం కంటే ముఖ్యమైనది ఏదీ లేదు. ప్రతి జిల్లా కలెక్టర్ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి. తక్షణమే సహాయక చర్యలు చేపట్టేందుకు అవసరమైన వనరులను సమకూర్చుకోవాలి" అని చంద్రబాబు నిర్దేశించారు. తీరప్రాంత ప్రజలకు తుఫాన్ తీవ్రతపై అవగాహన కల్పించి, వారిని సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సూచించారు. పరిస్థితులను బట్టి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించే అధికారాన్ని కలెక్టర్లకే అప్పగించారు.

అన్ని ప్రధాన, మధ్య తరహా జలాశయాల్లో నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షించాలని, నీటి విడుదలను శాస్త్రీయ పద్ధతిలో చేపట్టాలని ఇరిగేషన్ అధికారులకు స్పష్టం చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను ముందుగానే ప్రభావిత ప్రాంతాలకు తరలించి, సహాయక చర్యలకు సిద్ధంగా ఉంచాలన్నారు. కాకినాడలో 'హాస్పిటల్ ఆన్ వీల్స్' సేవలను అందుబాటులో ఉంచాలని ప్రత్యేకంగా సూచించారు. 

ఆర్ అండ్ బీ, విద్యుత్, నీటిపారుదల, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, మొబైల్ టవర్స్, నిత్యావసరాల పంపిణీ వంటి అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు. తుపాను ప్రభావిత జిల్లాలకు ప్రత్యేకంగా ఇన్‌ఛార్జి అధికారులను నియమించి, క్షేత్రస్థాయిలో నష్ట నివారణ చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు.


More Telugu News