ఇండోర్‌లో ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లతో అసభ్య ప్రవర్తన... క్రికెట్ ఆస్ట్రేలియా స్పందన

  • భారత్‌లో ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు వేధింపులు
  • ఇండోర్‌లో ఇద్దరు ప్లేయర్లతో అసభ్యంగా ప్రవర్తించిన బైకర్
  • ఘటనను ధృవీకరించిన క్రికెట్ ఆస్ట్రేలియా
  • టీమ్ సెక్యూరిటీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు
  • బైక్ నంబర్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసిన అధికారులు
మహిళల వరల్డ్ కప్ కోసం భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఇద్దరు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లను ఓ మోటార్‌ సైక్లిస్ట్ అసభ్యంగా తాకినట్టు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ధృవీకరించింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడిని అరెస్ట్ చేశారు.

"ఇండోర్‌లో మా జట్టులోని ఇద్దరు సభ్యులను ఓ మోటార్‌ సైక్లిస్ట్ అనుసరించి, అసభ్యంగా తాకిన మాట వాస్తవమే. ఈ విషయాన్ని మా టీమ్ సెక్యూరిటీ సిబ్బంది స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం పోలీసులు ఈ వ్యవహారాన్ని చూస్తున్నారు' అని క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రస్తుతం జరుగుతున్న వన్డే మహిళల ప్రపంచకప్ 2025 కోసం ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ఇండోర్‌లో బస చేసిన ఇద్దరు క్రీడాకారిణులు, హోటల్ నుంచి సమీపంలోని ఓ కేఫ్‌కు నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఖజ్రానా రోడ్డు ప్రాంతంలో ఓ వ్యక్తి బైక్‌పై వారిని అనుసరించి, అసభ్యంగా తాకినట్లు ఆస్ట్రేలియా జట్టు భద్రతా సిబ్బంది పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆస్ట్రేలియా జట్టు సెక్యూరిటీ మేనేజర్ డానీ సిమన్స్ గురువారం సాయంత్రం ఎంఐజీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితుల వాంగ్మూలాలను నమోదు చేసుకుని, భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 74 (మహిళల పట్ల అసభ్య ప్రవర్తన), సెక్షన్ 78 (స్టాకింగ్) కింద కేసు నమోదు చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హిమానీ మిశ్రా తెలిపారు.

ఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న ఓ వ్యక్తి నిందితుడి బైక్ నంబర్‌ను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ నంబర్ ఆధారంగా పోలీసులు అఖీల్ ఖాన్ అనే వ్యక్తిని శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడిపై గతంలోనూ అనేక క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. 


More Telugu News