Prabhas: ప్రభాస్ 'ఫౌజీ' టైటిల్ ప్రకటనలో సంస్కృత శ్లోకాలు... ఎందుకో చెప్పిన దర్శకుడు హను రాఘవపూడి

Prabhas Fauji Title Explained by Director Hanu Raghavapudi
  • ప్రభాస్, హను రాఘవపూడి సినిమాకు 'ఫౌజీ' టైటిల్ ఖరారు
  • టైటిల్ ప్రకటనలో సంస్కృత శ్లోకాలపై వివరణ ఇచ్చిన దర్శకుడు
  • ఇది పౌరాణిక చిత్రం కాదు, దేశభక్తి డ్రామా అని స్పష్టీకరణ
  • భగవద్గీత నుంచి తాత్విక స్ఫూర్తి మాత్రమే తీసుకున్నామన్న హను
  • బ్రిటిష్ కాలం నాటి కథాంశంతో భారీ స్థాయిలో సినిమా నిర్మాణం
  • వచ్చే ఏడాది బహుళ భాషల్లో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, 'సీతారామం' ఫేమ్ హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రానికి టైటిల్ ఖరారవడం తెలిసిందే. ఈ సినిమాకు 'ఫౌజీ' అనే శక్తివంతమైన పేరును ఖరారు చేసినట్లు చిత్రబృందం గురువారం నాడు అధికారికంగా ప్రకటించింది. అయితే, టైటిల్ ప్రకటనలో సంస్కృత శ్లోకాలను ఉపయోగించడంపై వస్తున్న ఊహాగానాలపై దర్శకుడు హను రాఘవపూడి స్పష్టతనిచ్చారు.

ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ, "మా యోధుడి కథకు మరింత గంభీరత, లోతైన అర్థం తీసుకురావాలనే ఉద్దేశంతోనే సంస్కృత శ్లోకాలను ఉద్దేశపూర్వకంగా ఉపయోగించాం. అయితే, ఇది పౌరాణిక చిత్రం కాదు. మేం భగవద్గీత నుంచి కేవలం తాత్విక స్ఫూర్తిని మాత్రమే తీసుకున్నాం. 'ఫౌజీ' అనేది బ్రిటిష్ కాలం నాటి సామాజిక-రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సాగే ఒక శక్తివంతమైన దేశభక్తి డ్రామా. ఇందులో మానవ భావోద్వేగాలకు పెద్దపీట వేశాం. ఆనాటి సమస్యలు నేటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి" అని వివరించారు.

'సీతారామం' వంటి దృశ్యకావ్యంతో ఆకట్టుకున్న హను, ఈ సినిమాను కూడా భారీ స్థాయిలో, అద్భుతమైన విజువల్స్‌తో తెరకెక్కిస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ మళ్లీ పూర్తిస్థాయి పీరియడ్ డ్రామాలో నటిస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఈ చిత్రంలో ప్రభాస్.. విధి, భావోద్వేగం, సిద్ధాంతాల మధ్య నలిగిపోయే సంక్లిష్టమైన పాత్రలో కనిపించనున్నారని సమాచారం.

1940ల నేపథ్యంలో సాగే ఈ కాల్పనిక చారిత్రక కథలో ప్రభాస్ సరసన ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. వీరితో పాటు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భానుచందర్, జయప్రద వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'సీతారామం' బ్లాక్‌బస్టర్‌కు సంగీతం అందించిన విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికీ స్వరాలు సమకూరుస్తుండటం విశేషం. సుదీప్ ఛటర్జీ సినిమాటోగ్రఫీ, కృష్ణకాంత్ సాహిత్యం అందిస్తున్నారు. శీతల్ శర్మ కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. 'ఫౌజీ' చిత్రాన్ని వచ్చే ఏడాది బహుళ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Prabhas
Fauji
Hanu Raghavapudi
Prabhas Fauji
Vishal Chandrasekhar
Imanv
Telugu movie
Period drama
Indian cinema
Patriotic drama

More Telugu News