Adluri Lakshman: అంబేద్కర్ విగ్రహం దగ్గర తేల్చుకుందాం.. హరీశ్‌కు అడ్లూరి సవాల్

Adluri Lakshman Challenges Harish Rao to Debate at Ambedkar Statue
  • కేబినెట్‌ను దండుపాళ్యం బ్యాచ్ అనడంపై మంత్రి అడ్లూరి ఫైర్
  • హరీశ్ రావుకు బహిరంగ చర్చకు సవాల్ విసిరిన మంత్రి
  • పదేళ్ల బీఆర్ఎస్ పాలన, రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమన్న అడ్లూరి
రాష్ట్ర కేబినెట్ సమావేశంపై మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన 'దండుపాళ్యం బ్యాచ్' వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ హరీశ్ రావుకు ఆయన సవాల్ విసిరారు. హైదరాబాద్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్దకు తాము వస్తామని, చర్చకు మీరు వస్తారా? అని సూటిగా ప్రశ్నించారు. సిద్దిపేటలో ఈరోజు మీడియాతో మాట్లాడిన అడ్లూరి లక్ష్మణ్.. హరీశ్ రావు వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయన్నారు. 

"ఒక ఉద్యమ నాయకుడు అయి ఉండి కేబినెట్‌ను అలా సంబోధించడం సిగ్గుచేటు. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో హరీశ్ రావు మంత్రిగా పనిచేశారు, ఆ విషయం ఆయన మరవొద్దు. మా కేబినెట్ మీటింగ్ ప్రజల అవసరాల కోసమే... అంతే తప్ప, దండుపాళ్యంలా దోచుకోవడానికి కాదు" అని ఆయన స్పష్టం చేశారు.

పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఇలా మాట్లాడటం దారుణమన్నారు. ఒక మాజీ ఎమ్మెల్యేతో, తన భజన మండలితో తనను తిట్టించడం ఎంతవరకు సమంజసమని హరీశ్‌ను ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలు కూడా కాకముందే ఇంతగా టార్గెట్ చేయడం సరికాదన్నారు. దళిత ముఖ్యమంత్రి, ఇంటికో ఉద్యోగం లాంటి హామీలను బీఆర్ఎస్ నెరవేర్చిందా? అని నిలదీశారు. పదేళ్లలో ఒక్కరికైనా నియామక పత్రం ఇచ్చారా? అని అడిగారు.

"ముఖ్యమంత్రిని, మంత్రులను ఏకవచనంతో మాట్లాడటం సరికాదు. బీఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకుంటూనే మేము సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలే మాకు బుద్ధి చెబుతారు" అని అన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్‌ను కేంద్రం ఎందుకు అమలు చేయడం లేదో రాష్ట్రంలోని ఇద్దరు కేంద్ర మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తనకు ఆస్తులు, ఫామ్ హౌస్‌ల కన్నా దళితుల ఆత్మగౌరవమే ముఖ్యమని, త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్, గ్రామస్థాయి ఎన్నికల్లో ప్రజలు ఎవరికి మద్దతిస్తారో చూద్దామని అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు.

Adluri Lakshman
Harish Rao
BRS
Telangana Cabinet
Ambedkar Statue
Telangana Politics
Congress Party
Dandu Pallyam
BC Reservations
Telangana Elections

More Telugu News