ఆస్ట్రేలియా పర్యటన విజయవంతం... పూర్తి విశ్వాసంతో తిరిగి వస్తున్నా: మంత్రి నారా లోకేశ్

  • మంత్రి నారా లోకేశ్ ఏడు రోజుల ఆస్ట్రేలియా పర్యటన ముగింపు
  • నాలుగు నగరాల్లో విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల ప్రతినిధులతో భేటీ
  • 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యమని స్పష్టీకరణ
  • క్రీడలను కూడా ఆర్థిక వనరుగా మార్చే అవకాశం ఉందన్న లోకేశ్
  • ఏపీకి ప్రయోజనకరమైన భాగస్వామ్యాలు వస్తాయని ధీమా వ్యక్తం
  • నైపుణ్యాభివృద్ధి, ఆర్ అండ్ డీ రంగాలపై ప్రత్యేక దృష్టి
ఏపీ ఐటీ, మానవ వనరులు, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తన ఏడు రోజుల ఆస్ట్రేలియా పర్యటనను విజయవంతంగా ముగించారు. నాలుగు నగరాల్లో సాగిన ఈ పర్యటన రాష్ట్రానికి ఎంతో ఫలవంతంగా సాగిందని, త్వరలోనే కీలక భాగస్వామ్యాలు కుదరనున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ పర్యటన ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, చర్చలు ఫలించి ఏపీకి మేలు జరుగుతుందని ఆయన తెలిపారు.

ఆస్ట్రేలియా పర్యటన ముగిసిన సందర్భంగా లోకేశ్ సోషల్ మీడియాలో స్పందించారు. "విశ్వవిద్యాలయాలు, ప్రముఖ పరిశ్రమలు, ఇండియా-ఆస్ట్రేలియా కౌన్సిళ్లు, సీఫుడ్ వాణిజ్య సంస్థలు, క్రీడా సముదాయాల ప్రతినిధులతో సమావేశమయ్యాను. ఈ పర్యటన ఎంతో లోతైన అవగాహనను ఇచ్చింది" అని వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నామని, అందుకు అనుగుణంగా మానవ వనరులను బలోపేతం చేయడం, పరిశోధన-అభివృద్ధి (ఆర్ అండ్ డీ) రంగాన్ని ప్రోత్సహించడం, నైపుణ్యం గల యువతను తయారు చేయడం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.

ఈ పర్యటనలో క్రీడారంగానికి ఉన్న ఆర్థిక ప్రాధాన్యతను కూడా గుర్తించినట్లు లోకేశ్ తెలిపారు. క్రీడలను కేవలం వినోదంగానే కాకుండా, బలమైన ఆర్థిక కార్యకలాపాలుగా మార్చడంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియాలో జరిపిన చర్చలు త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌కు అర్థవంతమైన భాగస్వామ్యాలుగా మారతాయనే పూర్తి విశ్వాసంతో తిరిగి వస్తున్నానని లోకేశ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.


More Telugu News