Amnesty International: బలూచిస్థాన్‌పై పాకిస్థాన్ తీరు.. తీవ్రంగా మండిపడిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్

Amnesty International Slams Pakistans Actions in Balochistan
  • బలూచిస్థాన్ ప్రజలను పాక్ ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తుందని ఆగ్రహం
  • ఉగ్రవాద నిరోధక చట్టాలను ఉద్యమకారుల అణిచివేతకు ఉపయోగిస్తోందని ఆరోపణ
  • ప్రత్యేక దేశం కోసం పోరాడే వారి హక్కులను కాలరాయొద్దన్న ఆమ్నెస్టీ 
బలూచిస్థాన్ ప్రజలు ప్రత్యేక దేశం కోసం శాంతియుతంగా పోరాడుతుంటే, పాకిస్థాన్ వారిని ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తోందని మానవ హక్కుల సంస్థ 'ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్' ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాద నిరోధక చట్టాలను పాక్ దుర్వినియోగం చేస్తూ, బలూచ్ ఉద్యమకారుల అణిచివేతకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. 1997 ఉగ్రవాద నిరోధక చట్టం కింద బలూచ్‌కు చెందిన 32 మందిని పాక్ తన వాచ్ లిస్ట్‌లో చేర్చడాన్ని ఆమ్నెస్టీ తప్పుబట్టింది.

ప్రత్యేక దేశం కోసం పోరాడే వారిని వాచ్ లిస్ట్‌లో చేర్చడం సరికాదని, ఇది వారి హక్కులను పూర్తిగా కాలరాయడమేనని ఆమ్నెస్టీ దక్షిణాసియా రీజినల్ డైరెక్టర్ బాబూ రామ్ అన్నారు. పాక్ చర్యల వల్ల స్వేచ్ఛ, గోప్యత, ఉద్యమానికి సంబంధించిన ప్రాథమిక హక్కులు దెబ్బతింటున్నాయని ఆయన ఆరోపించారు. పాక్ తన వాచ్ లిస్ట్‌లో మహిళలను కూడా చేర్చి హద్దులు దాటిందని విమర్శించారు. దీనివల్ల వాచ్ లిస్ట్‌లో ఉన్నవారు కఠిన పర్యవేక్షణ, ప్రయాణ ఆంక్షలను ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు.

బలూచ్ ఉద్యమకారులకు వ్యతిరేకంగా పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించే అవకాశం కూడా వారికి లేకుండా పోయిందని ఆయన అన్నారు. పాక్ చర్యలను అడ్డుకోవాలంటే అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలకు అనుగుణంగా ఆ దేశం ఉగ్రవాద నిరోధక చట్టాలను సవరించాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ డిమాండ్ చేసింది.
Amnesty International
Balochistan
Pakistan
Human Rights
Balochistan conflict
Terrorism
Anti-Terrorism Act

More Telugu News