Kolusu Parthasarathi: బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ తెలిసి కూడా జగన్ అలా మాట్లాడడం పద్ధతి కాదు: మంత్రి పార్థసారథి

Kolusu Parthasarathi Slams Jagan Over Balakrishna Remarks
  • బాలకృష్ణపై జగన్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి పార్థసారథి
  • అసెంబ్లీకి రాకుండా మాట్లాడటం సరికాదని హితవు
  • జగన్ హయాంలో అదానీ డేటా సెంటర్ ఎందుకు రాలేదని ప్రశ్న
  • నివాసయోగ్యం కాని సెంటు భూమి లేఅవుట్లు రద్దు చేస్తామని ప్రకటన
వైసీపీ అధినేత జగన్ పై రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా, సహచర శాసనసభ్యుడి గురించి ఇష్టానుసారంగా మాట్లాడటం జగన్‌కు తగదని హితవు పలికారు.

శుక్రవారం నాడు సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అనంతరం మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ గురించి, ఆయన ప్రవర్తన గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, అలాంటి వ్యక్తిపై అభ్యంతరకర వ్యాఖ్యలు ఎలా చేస్తారని జగన్‌ను ప్రశ్నించారు. ఇది సరైన పద్ధతి కాదని సూచించారు. అనంతరం విశాఖ డేటా సెంటర్ అంశాన్ని ప్రస్తావిస్తూ, జగన్ హయాంలో అదానీ డేటా సెంటర్ ఎందుకు ఏర్పాటు కాలేదని నిలదీశారు. ఆ సంస్థ ఏపీ నుంచి ఎందుకు వెనక్కి వెళ్లిపోయిందో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను పార్థసారథి వెల్లడించారు. గత ప్రభుత్వం పేదలకు కేటాయించిన సెంటు భూమి స్థలాలు చాలాచోట్ల నివాసయోగ్యంగా లేవని విమర్శించారు. ఈ నేపథ్యంలో, ఇంకా నిర్మాణాలు ప్రారంభం కాని లేఅవుట్లను రద్దు చేసి, లబ్ధిదారులకు 2 నుంచి 3 సెంట్ల స్థలం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇప్పటికే నిర్మాణాలు మొదలుపెట్టి పూర్తికాని వారికి కూడా ఇదే తరహాలో కేటాయింపులు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ సమావేశంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించే అంశంపై కూడా చర్చించామని, ఈ విషయంలో ఉన్న సమస్యలను అధిగమించి త్వరలోనే ముందుకు వెళతామని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు.
Kolusu Parthasarathi
Jagan
Balakrishna
TDP
YSRCP
Andhra Pradesh Politics
AP Assembly
Adani Data Center
House Sites for Poor
Journalists Housing

More Telugu News