Virat Kohli: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన గవాస్కర్!

Sunil Gavaskar Clarifies Virat Kohli Retirement Rumors
  • ఆసీస్‌తో రెండో వన్డేలోనూ డకౌట్ అయిన విరాట్ కోహ్లీ
  • కోహ్లీ పెవిలియన్ వెళ్తుండగా స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చిన ప్రేక్షకులు
  • రిటైర్మెంట్‌పై సోషల్ మీడియాలో మొదలైన ఊహాగానాలు
  • పుకార్లను ఖండించిన దిగ్గజం సునీల్ గవాస్కర్
  • కోహ్లీలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని వ్యాఖ్య
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌పై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఖండించాడు. వరుసగా రెండు మ్యాచ్‌లలో డకౌట్ అయినంత మాత్రాన ఒక గొప్ప ఆటగాడి కెరీర్‌ ముగిసిందని భావించకూడదని, అతనిలో ఇంకా చాలా ఆట మిగిలి ఉందని స్పష్టం చేశాడు.

ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరిగిన రెండో వన్డేలో విరాట్ కోహ్లీ సున్నా పరుగులకే ఔటయ్యాడు. తనకు ఎంతో ఇష్టమైన, మంచి రికార్డు ఉన్న మైదానంలో డకౌట్‌గా వెనుదిరగడంతో తీవ్ర నిరాశతో పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ సమయంలో స్టేడియంలోని ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లతో (స్టాండింగ్ ఓవియేషన్) అభినందించారు. దీనికి ప్రతిగా కోహ్లీ కూడా గ్లోవ్స్ తీసి అభివాదం చేస్తూ మైదానాన్ని వీడాడు. అయితే, ఈ దృశ్యం కోహ్లీ వీడ్కోలుకు సంకేతమంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.

ఈ ఊహాగానాలపై సునీల్ గవాస్కర్ స్పందిస్తూ.. "వన్డేల్లో 52 సెంచరీలు, 14 వేలకు పైగా పరుగులు, టెస్టుల్లో 32 శతకాలు సాధించిన ఆటగాడిని రెండు డకౌట్లకే తప్పుపట్టలేం. అడిలైడ్‌లో మంచి రికార్డు ఉండటంతో వైఫల్యాన్ని అతడు, అభిమానులు జీర్ణించుకోలేకపోవడం సహజమే. కానీ ఒక ఆటగాడి కెరీర్‌లో ఇవి సాధారణం" అని పేర్కొన్నాడు. కోహ్లీ మైదానం వీడుతున్నప్పుడు భారత అభిమానులతో పాటు ఆస్ట్రేలియన్లు కూడా లేచి నిలబడి అభినందించడం ఒక గొప్ప ఆటగాడికి దక్కే గౌరవమని గవాస్కర్ అన్నాడు.

"ఇదేమీ కోహ్లీ కెరీర్‌కు ముగింపు కాదు. విరాట్ అంత తేలికగా ఓటమిని అంగీకరించే రకం కాదు. సిడ్నీలో జరిగే తర్వాతి మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడినా ఆశ్చర్యపోనవసరం లేదు. త్వరలో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌తో పాటు 2027 వన్డే ప్రపంచకప్‌లోనూ రోహిత్ శర్మతో కలిసి కోహ్లీ ఆడతాడని నేను భావిస్తున్నా" అని గవాస్కర్ విశ్వాసం వ్యక్తం చేశారు. 
Virat Kohli
Virat Kohli retirement
Sunil Gavaskar
India cricket
Australia ODI
Adelaide Oval
Cricket news
Rohit Sharma
2027 World Cup
South Africa series

More Telugu News