Kolicapudi Srinivasa Rao: కొలికపూడి వ్యవహారంపై చంద్రబాబు అసహనం.. పల్లా అపాయింట్‌మెంట్ కోరిన కొలికపూడి!

Kolicapudi Srinivasa Rao Seeks Palla Srinivasa Rao Appointment Amidst Chandrababus Displeasure
  • కేశినేని చిన్ని, కొలికపూడి శ్రీనివాస్ మధ్య ముదిరిన వివాదం
  • సీఎం చంద్రబాబు సీరియస్ కావడంతో కీలక పరిణామం
  • ఎంపీపై చేసిన పోస్టులపై వివరణ ఇచ్చేందుకు కొలికపూడి యత్నం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీలో చెలరేగిన వివాదం కొత్త మలుపు తీసుకుంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య నడుస్తున్న మాటల యుద్ధంపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేసినప్పటికీ, ఈ వ్యవహారం సద్దుమణగడం లేదు. తాజాగా కొలికపూడి శ్రీనివాసరావు.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అపాయింట్‌మెంట్ కోరడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఎంపీ కేశినేని చిన్నిని లక్ష్యంగా చేసుకుని ఎమ్మెల్యే కొలికపూడి సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేయడంతో ఈ వివాదం ప్రారంభమైంది. విషయం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఆయన దుబాయ్ నుంచే పల్లా శ్రీనివాసరావుకు ఫోన్ చేసి, వివాదంలో ఉన్న నేతలతో మాట్లాడాల్సిన అవసరం లేదని, ఎవరినీ పార్టీ కార్యాలయానికి పిలవవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఇంత సీరియస్‌గా ఉన్న తరుణంలో, ఆయనే స్వయంగా జోక్యం చేసుకోవద్దని చెప్పిన తర్వాత ఎమ్మెల్యే కొలికపూడి.. పల్లా అపాయింట్‌మెంట్ కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈరోజు పల్లా శ్రీనివాసరావుతో కొలికపూడి భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమావేశంలో, తాను ఎంపీ కేశినేనిపై ఎందుకు పోస్టులు పెట్టాల్సి వచ్చిందో వివరణ ఇచ్చేందుకు ఆయన సిద్ధమైనట్లు తెలుస్తోంది. అధిస్ఠానం ఆదేశాలను మీరినట్లు కనిపించినా, తన వాదనను వినిపించాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, ముఖ్యమంత్రి వద్దన్న తర్వాత కూడా ఈ భేటీ జరగనుండటంతో ఈ వివాదం ఇకపై ఎటువైపు దారి తీస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
Kolicapudi Srinivasa Rao
Chandrababu Naidu
Palla Srinivasa Rao
Kesineni Chinni
TDP
Andhra Pradesh Politics
Vijayawada MP
Tiruvuru MLA
Krishna District
Political Controversy

More Telugu News