అడవిలో 30 గంటల నరకం.. వృద్ధురాలిని కాపాడిన డ్రోన్ కెమెరా

  • పల్నాడు జిల్లాలో అడవిలో తప్పిపోయిన వృద్ధురాలు
  • బంధువుల ఇంటికి వెళ్తూ దారి తప్పిన బోడిబాయి
  • ఉరుములు, వర్షంలో రాత్రంతా కొండపైనే జాగారం
  • దాదాపు 30 గంటల పాటు అడవిలోనే నరకయాతన
  • గాలింపు చర్యలు చేపట్టిన బండ్లమోటు పోలీసులు
  • డ్రోన్ కెమెరా సాయంతో ఆమెను గుర్తించిన వైనం
బంధువుల ఇంటికి వెళుతూ దారి తప్పి దట్టమైన అడవిలో చిక్కుకుపోయిన ఓ వృద్ధురాలు సుమారు 30 గంటల పాటు నరకయాతన అనుభవించారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంలో రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపిన ఆమెను పోలీసులు డ్రోన్ కెమెరా సాయంతో గుర్తించి సురక్షితంగా ఇంటికి చేర్చారు. పల్నాడు జిల్లా బండ్లమోటు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. దుర్గి మండలం పోలేపల్లికి చెందిన బనావత్ బోడిబాయి (60) అనే మహిళ, బొల్లాపల్లి మండలంలోని మేకలదిన్నె తండాలో ఉన్న తన బంధువుల ఇంటికి బుధవారం ఉదయం బయలుదేరారు. గండిగనుమల తండా వద్ద బస్సు దిగి, అక్కడి నుంచి కాలినడకన వెళుతుండగా దారి తప్పిపోయారు. ఆమె ఊరి వైపు వెళ్లే మార్గానికి బదులుగా దట్టమైన అడవిలోకి ప్రవేశించారు. చీకటి పడటం, జోరుగా వర్షం కురుస్తుండటంతో.. ఏం చేయాలో తెలియక ఓ కొండపైకి ఎక్కి రాత్రంతా అక్కడే గడిపారు.

బోడిబాయి బంధువుల ఇంటికి చేరకపోవడంతో ఆమె కుమారుడు ఆందోళనకు గురయ్యాడు. బంధువులకు ఫోన్ చేసి తన తల్లి రాలేదని తెలుసుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి సమీప అటవీ ప్రాంతంలో బుధవారం రాత్రి 11 గంటల వరకు వెతికారు. ఫలితం లేకపోవడంతో బండ్లమోటు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.

గురువారం కూడా గాలింపు కొనసాగించారు. అడవిలో మనుషులు వెళ్లలేని ప్రాంతాలను సైతం జల్లెడ పట్టేందుకు డ్రోన్‌ను ఉపయోగించారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కొండ దిగి తిరిగి నడుచుకుంటూ వస్తున్న బోడిబాయిని డ్రోన్ కెమెరా గుర్తించింది. వెంటనే పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకుని, తీవ్ర భయాందోళనతో నీరసంగా ఉన్న ఆమెను క్షేమంగా బయటకు తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో 30 గంటల ఉత్కంఠకు తెరపడింది. కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.


More Telugu News