Nara Lokesh: ఏపీకి గూగుల్ రాక వెనుక 13 నెలల శ్రమ ఉంది: మంత్రి లోకేశ్‌

Nara Lokesh Highlights Investment Opportunities in Andhra Pradesh
  • పెట్టుబడిదారులకు మూడు ప్రధాన కారణాలు వివరించిన మంత్రి 
  • ప్రాజెక్టులు మీవి కావు.. మనవి అంటూ పెట్టుబడిదారులకు భరోసా
  • గత 16 నెలల్లో రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్ల‌డి
  • ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామ‌న్న లోకేశ్‌
  • నవంబర్‌లో విశాఖలో పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్.. హాజరు కావాలని ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్‌కు గూగుల్ డేటా సెంటర్ రావడం వెనుక 13 నెలల నిరంతర కృషి దాగి ఉందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ వెల్లడించారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ (ఏఐబీసీ), సీఐఐ సంయుక్తంగా నిర్వహించిన పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెట్టుబడిదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎందుకు ఎంచుకోవాలో వివరించారు.

పెట్టుబడులకు మూడు ప్రధాన కారణాలు
ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి మూడు ముఖ్య కారణాలు ఉన్నాయని లోకేశ్‌ తెలిపారు. "మొదటిది, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రూపంలో అనుభవజ్ఞుడైన, దార్శనిక నాయకత్వం ఉంది. భారీ ప్రాజెక్టులను ఎలా తీసుకురావాలో ఆయనకు బాగా తెలుసు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా మెండుగా ఉంది. రెండో కారణం, మేం ఒక స్టార్టప్ స్టేట్ మాదిరిగా దృఢ సంకల్పంతో పనిచేస్తాం. ఒకసారి మాతో చేతులు కలిపితే అది మీ ప్రాజెక్ట్ కాదు.. మన ప్రాజెక్ట్. వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రాజెక్టు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తాం. నిర్దేశించిన సమయం కంటే ముందే పూర్తిచేయడమే మా లక్ష్యం. మూడోది, మాది జాతీయ దృక్పథం ఉన్న ప్రాంతీయ పార్టీ. దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూనే, రాష్ట్రానికి మేలు చేకూర్చేలా జాతీయ విధానాలను ప్రభావితం చేస్తాం" అని వివరించారు.

గూగుల్, ఆర్సెలర్ మిట్టల్ ఉదాహరణలు
గూగుల్ ప్రాజెక్టు కోసం తాము పడిన శ్రమను లోకేశ్‌ గుర్తుచేశారు. "గూగుల్ డేటా హబ్ వెనుక 13 నెలల నిరంతర శ్రమ ఉంది. నేను స్వయంగా వారిని ప్రాజెక్టు స్థలానికి తీసుకెళ్లాను. వారి కార్యాలయానికి వెళ్లి ఏపీని ఎందుకు ఎంచుకోవాలో వివరించాను. వారు కోరిన విధానపరమైన మార్పుల కోసం ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్‌లతో మాట్లాడి మార్పులు చేయించాం" అని తెలిపారు. కేవలం ఒక జూమ్ కాల్ ద్వారా దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ అయిన ఆర్సెలర్ మిట్టల్ ప్రాజెక్టును ఏపీకి తీసుకొచ్చామని, నవంబర్‌లో దీనికి శంకుస్థాపన చేయనున్నామని చెప్పారు.

16 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు
గత 16 నెలల్లో రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయని, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని లోకేశ్‌ స్పష్టం చేశారు. "ప్రస్తుతం 180 బిలియన్ డాలర్లుగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లడమే మా లక్ష్యం. ఆటోమోటివ్, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ సహా 15 రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాం. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది, త్వరలోనే మొదటి స్థానానికి చేరుకుంటాం" అని ధీమా వ్యక్తం చేశారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు హాజరై, రాష్ట్రంలోని అవకాశాలను పరిశీలించాలని పెట్టుబడిదారులను ఆయన ఆహ్వానించారు.

Nara Lokesh
Andhra Pradesh
Google Data Center
AP Investments
Partnership Summit
Chandrababu Naidu
Arcelor Mittal
Visakhapatnam
AP Economy
Australia India Business Council

More Telugu News