YS Jagan Mohan Reddy: గూగుల్ సెంటర్‌పై క్రెడిట్ వార్.. రంగంలోకి దిగిన జగన్

YS Jagan Claims Credit for Google Data Center Project
  • విశాఖ గూగుల్ ఏఐ డేటా సెంటర్‌పై స్పందించిన మాజీ సీఎం జగన్
  • ప్రాజెక్టును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు ప్రకటన
  • తమ హయాంలోనే అదానీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన జరిగిందని వెల్లడి
  • తానే తెచ్చినట్లు చంద్రబాబు ప్రచారం చేసుకోవడంపై తీవ్ర విమర్శ
  • పర్యావరణానికి ముప్పు కలుగుతుందన్న వాదనలను తోసిపుచ్చిన జగన్
విశాఖపట్నంలో ఏర్పాటు కానున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్‌పై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టు ఘనత తమ ప్రభుత్వానిదేనని చెబుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై అనవసర ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.

గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన జగన్ ఈ ప్రాజెక్టుకు తమ ప్రభుత్వ హయాంలోనే పునాది పడిందని గుర్తుచేశారు. ‘‘2023 మే 3వ తేదీన విశాఖలో అదానీ డేటా సెంటర్‌కు మేమే శంకుస్థాపన చేశాం. సింగపూర్ నుంచి సబ్-సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుకు కూడా అప్పుడే శ్రీకారం చుట్టాం. అదానీ గ్రూప్ డేటా సెంటర్‌ను నిర్మించాకే గూగుల్ ఇక్కడికి వస్తుంది’’ అని ఆయన వివరించారు.

రాబోయేది ఏఐ యుగమని, ఇలాంటి సమయంలో రాష్ట్రానికి డేటా సెంటర్లు రావడం ఎంతో మంచి పరిణామమని జగన్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలో ఎకో సిస్టమ్ అభివృద్ధి చెందుతుందని, దీనిని తాము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని తెలిపారు. డేటా సెంటర్ వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందంటూ వస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. తమ ప్రభుత్వం గూగుల్ డేటా సెంటర్‌ను ఎప్పుడూ వ్యతిరేకించలేదని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ విమర్శలు గుప్పించారు. ‘‘ఈ ప్రాజెక్టును తానే తెచ్చినట్లు చంద్రబాబు చెప్పుకోవడం సరికాదు. ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషిస్తున్న అదానీ గ్రూపునకు ఆయన కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పలేదు’’ అని జగన్ ఆరోపించారు.
YS Jagan Mohan Reddy
Google AI Data Center
Visakhapatnam
Andhra Pradesh
Adani Group
Data Center
Chandrababu Naidu
YSR Congress Party
Sub-Sea Cable
Artificial Intelligence

More Telugu News