KCR: బస్సు ప్రమాదంపై కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత స్పందన

KCR KTR Harish Kavitha reacts to Kurnool bus accident
  • హైదరాబాద్-బెంగళూరు బస్సులో 20 మంది సజీవ దహనంపై ఆవేదన
  • మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కేసీఆర్
  • మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
కర్నూలు సమీపంలో జరిగిన ఘోర బస్సు అగ్నిప్రమాదం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సు అగ్నికి ఆహుతై 20 మంది ప్రయాణికులు సజీవ దహనం కావడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన అన్నారు. ఇలాంటి దురదృష్టకర ఘటన జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆర్థికంగా ఆదుకోవాలని అన్నారు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు కూడా ఈ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 20 మందికి పైగా ప్రయాణికులు మరణించడం దిగ్భ్రాంతికరమని కేటీఆర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు హరీశ్ రావు సానుభూతి ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. 

ఈ సంఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన కవిత, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. "బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను" అని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలకు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
KCR
Kurnool bus accident
Telangana
KTR
Harish Rao
Kavitha
bus fire
road accident
Andhra Pradesh
Bengaluru

More Telugu News