Chandrababu: కర్నూలు బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి

Chandrababu Reacts to Kurnool Bus Tragedy From Dubai
  • కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం
  • ఘటనపై దుబాయ్ నుంచి సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
  • సీఎస్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి
  • వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని ఉన్నతాధికారులకు ఆదేశం
  • క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచన
  • కర్నూలు ఘ‌ట‌న అత్యంత బాధాకరమన్న మంత్రి లోకేశ్ 
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికులతో వెళుతున్న బస్సు దగ్ధమై పలువురు మరణించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్న ఆయన, ఈ దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే స్పందించి, రాష్ట్ర అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు.

ప్రమాద వివరాలను అధికారులు దుబాయ్‌లో ఉన్న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సహా ఇతర ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగిన తీరు, ప్రాణ నష్టం వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.

తక్షణమే ఉన్నత స్థాయి అధికారుల బృందం ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. గాయపడిన వారికి సాధ్యమైనంత త్వరగా మెరుగైన వైద్య సేవలు అందించాలని, బాధితుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని సూచించారు. మృతుల సంఖ్య మరింత పెరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.

కర్నూలు ఘ‌ట‌న అత్యంత బాధాకరం: మంత్రి లోకేశ్ 
కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సు దగ్ధమై పలువురు ప్రయాణికులు మృతిచెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి లోకేశ్ అన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమ‌ని పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై ప్రభుత్వం అన్ని రకాల సహయక చర్యలను చేపట్టింద‌ని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన‌ట్లు తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Chandrababu
Kurnool bus accident
Andhra Pradesh bus fire
Road accident Andhra Pradesh
Chandrababu Naidu Dubai tour
AP government
Bus accident casualties
Andhra Pradesh news

More Telugu News