సెంచరీలతో కదంతొక్కిన భారత ఓపెనర్లు స్మృతి, ప్రతీక... కివీస్ ముందు కొండంత లక్ష్యం

  • మహిళల ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో భారత్ ఢీ
  • టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా
  • తొలి వికెట్‌కు 212 పరుగుల రికార్డు భాగస్వామ్యం
  • చివర్లో మెరిసిన జెమీమా రోడ్రిగ్స్.. మెరుపు అర్ధశతకం
  • వర్షం కారణంగా 49 ఓవర్లకు కుదింపు.. 
  • భారత్ భారీ స్కోరు... 49 ఓవర్లలో 3 వికెట్లకు 340 పరుగులు 
ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో భారత జట్టు బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. న్యూజిలాండ్‌తో గురువారం జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ఓపెనర్లు స్మృతి మంధన (109), ప్రతిక రావల్ (122) అద్భుతమైన సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరి శతకాలకు జెమీమా రోడ్రిగ్స్ (76*) మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో, టీమిండియా 49 ఓవర్లలో 3 వికెట్లకు 340 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

నవీ ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఓపెనర్లు స్మృతి మంధన, ప్రతిక రావల్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారించారు. ఈ క్రమంలో ఇద్దరూ తమ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. తొలి వికెట్‌కు ఏకంగా 212 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. స్మృతి మంధన కేవలం 95 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో దూకుడుగా ఆడగా, ప్రతిక రావల్ నిలకడగా రాణించి 122 పరుగులు చేసింది.

వన్ డౌన్ లో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ తనదైన శైలిలో మెరుపులు మెరిపించింది. కేవలం 55 బంతుల్లోనే 11 ఫోర్ల సహాయంతో అజేయంగా 76 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (10) త్వరగా ఔటైనా, జెమీమా దూకుడు కొనసాగించింది.

భారత బ్యాటర్ల విజృంభణతో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగింది. అయితే, ఇన్నింగ్స్ చివర్లో వర్షం కురవడంతో అంపైర్లు మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. దీంతో భారత జట్టు 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 340 పరుగుల భారీ స్కోరు సాధించి న్యూజిలాండ్‌కు కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది.


More Telugu News