Jagan Mohan Reddy: జగన్ ఇచ్చిన ఫోన్ నెంబర్ పై సీబీఐ పిటిషన్.. 28న సీబీఐ కోర్టు తీర్పు

Jagans Europe Tour Tension CBI Court Verdict on 28th
  • ఇటీవల లండన్ పర్యటనకు వెళ్లిన జగన్
  • కోర్టుకు తప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చారని సీబీఐ ఆరోపణ
  • తీర్పును రిజర్వ్ చేసిన సీబీఐ కోర్టు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న జగన్ తన లండన్ పర్యటన సందర్భంగా న్యాయస్థానం విధించిన షరతులను ఉల్లంఘించారని సీబీఐ ఆరోపణలు చేసింది. పర్యటన కోసం ఆయన తప్పుడు ఫోన్ నంబర్ ఇచ్చి కోర్టును ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించారని, భవిష్యత్తులో ఆయన విదేశాలకు వెళ్లేందుకు అనుమతులు ఇవ్వరాదని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టును గట్టిగా కోరింది. అయితే, ఈ ఆరోపణలను జగన్ తరఫు న్యాయవాదులు ఖండించారు. అసలు జగన్‌కు ఫోన్ వాడే అలవాటే లేదని స్పష్టం చేశారు.

బుధవారం ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి టి.రఘురాం ఎదుట విచారణ జరిగింది. సీబీఐ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, జగన్ సమర్పించిన ఫోన్ నంబర్‌కు తాము మూడుసార్లు ఫోన్ చేయగా అది పనిచేయలేదని తెలిపారు. ఇది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని, ఆయన పర్యటన అనుమతిని తక్షణమే రద్దు చేయాలని కోరారు.

దీనిపై స్పందించిన జగన్ తరఫు న్యాయవాదులు, ఆయన గతంలో విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు కూడా తన వ్యక్తిగత సిబ్బంది ఫోన్ నంబర్లనే కోర్టుకు ఇచ్చారని గుర్తుచేశారు. జగన్‌కు ఫోన్ ఉపయోగించే అలవాటు లేదని తెలిపారు. అంతేకాకుండా, పర్యటనకు ఇంకా మూడు రోజుల గడువు ఉన్నప్పటికీ ఆయన ముందుగానే స్వదేశానికి తిరిగి వచ్చారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

కాగా, లండన్‌లో ఉన్న తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు అక్టోబర్ 1 నుంచి 30వ తేదీ మధ్య 15 రోజుల పాటు జగన్‌కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. పర్యటన వివరాలు, అక్కడి చిరునామా, ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ వంటివి సమర్పించాలని ఆదేశించింది. పర్యటన ముగించుకుని తిరిగి వచ్చాక కోర్టుకు హాజరు కావాలని కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 11న జగన్ లండన్ వెళ్లారు.

ఇరుపక్షాల వాదనలు ముగియడంతో, ఈ పిటిషన్‌పై తీర్పును ఈ నెల 28వ తేదీన వెల్లడిస్తామని న్యాయస్థానం ప్రకటించింది. 
Jagan Mohan Reddy
Jagan
CBI Court
Europe Tour
CBI Investigation
Andhra Pradesh Politics
Court Hearing
Petition
YSRCP
Foreign Tour

More Telugu News