Mohammed Ahmed: రష్యా కోసం యుద్ధం చేయలేను.. మెడపై గన్ పెట్టి బెదిరిస్తున్నారు: హైదరాబాదీ యువకుడి వీడియో

Mohammed Ahmed Hyderabad man stuck in Russia Ukraine war
  • ఉద్యోగం పేరుతో రష్యాకు వెళ్లి మోసపోయిన హైదరాబాదీ యువకుడు
  • ఉక్రెయిన్‌తో యుద్ధంలోకి బలవంతంగా నెట్టారని ఆవేదన
  • తనతో పాటు శిక్షణ పొందిన 17 మంది మృతి చెందారని సెల్ఫీ వీడియో
  • యువకుడిని రప్పించాలని కేంద్ర ప్రభుత్వానికి ఒవైసీ విజ్ఞప్తి
  • స్పందించిన భారత రాయబార కార్యాలయం
"నాతో పాటు శిక్షణ తీసుకున్న 25 మందిలో 17 మంది చనిపోయారు. వారిలో ఒక భారతీయుడు కూడా ఉన్నాడు. యుద్ధానికి వెళ్లనంటే మెడపై తుపాకీ పెట్టి చంపుతామని బెదిరిస్తున్నారు" అంటూ రష్యాలో చిక్కుకుపోయిన హైదరాబాద్ వాసి మహమ్మద్ అహ్మద్ పంపిన ఓ సెల్ఫీ వీడియో తీవ్ర కలకలం రేపుతోంది. ఉద్యోగం ఆశతో రష్యాకు వెళ్లిన ఆయన, ఏజెంట్ చేతిలో మోసపోయి ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధ క్షేత్రంలో ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్‌కు చెందిన 37 ఏళ్ల మహమ్మద్ అహ్మద్, ముంబైకి చెందిన ఓ కన్సల్టెన్సీ ద్వారా నిర్మాణ రంగంలో ఉద్యోగం కోసం ఈ ఏడాది ఏప్రిల్‌లో రష్యాకు వెళ్లారు. అక్కడకు వెళ్లాక నెల రోజుల పాటు పని ఇవ్వకుండా ఖాళీగా కూర్చోబెట్టారని ఆయన భార్య అఫ్షా బేగం ఆరోపించారు. ఆ తర్వాత అహ్మద్‌తో పాటు మరో 30 మందిని ఓ మారుమూల ప్రాంతానికి తరలించి, బలవంతంగా ఆయుధ శిక్షణ ఇచ్చారని ఆమె విదేశాంగ మంత్రి జైశంకర్‌కు రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

శిక్షణ అనంతరం 26 మందిని ఉక్రెయిన్ సైన్యంతో పోరాడేందుకు సరిహద్దుకు తీసుకెళ్తుండగా, అహ్మద్ సైనిక వాహనం నుంచి దూకేయడంతో ఆయన కుడి కాలుకు తీవ్ర గాయమైందని అఫ్షా బేగం తెలిపారు. "యుద్ధం చేయడానికి నిరాకరించడంతో, ఆయన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు" అని ఆమె వాపోయారు. తన భర్త కుటుంబానికి ఏకైక ఆధారం అని, పక్షవాతంతో బాధపడుతున్న అత్త, ఇద్దరు పిల్లలతో తాము దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, ఆయన్ను వెంటనే స్వదేశానికి రప్పించాలని ఆమె ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

అహ్మద్ పంపిన సెల్ఫీ వీడియోలో మరిన్ని షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. "మేమున్నది సరిహద్దు ప్రాంతం. ఇక్కడ నిరంతరం యుద్ధం జరుగుతోంది. మేం నలుగురు భారతీయులం యుద్ధానికి వెళ్లమని తెగేసి చెప్పాం. దాంతో నా మెడపై తుపాకీ పెట్టి చంపేస్తామని, డ్రోన్ దాడిలో చనిపోయినట్లు చిత్రీకరిస్తామని బెదిరించారు" అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తనను ఈ ఊబిలోకి దించిన ఏజెంట్‌ను వదలొద్దని ఆయన వేడుకున్నారు.

ఈ విషయంపై అహ్మద్ కుటుంబ సభ్యులు గత వారం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని కలిసి సహాయం కోరారు. వారి విజ్ఞప్తి మేరకు ఒవైసీ, విదేశాంగ శాఖకు, రష్యాలోని భారత రాయబార కార్యాలయానికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన మాస్కోలోని భారత రాయబార కార్యాలయం, అహ్మద్ వివరాలను రష్యా అధికారులకు అందజేసినట్లు తెలిపింది. అతన్ని సైన్యం నుంచి వీలైనంత త్వరగా విడుదల చేసి, సురక్షితంగా భారత్‌కు పంపాలని కోరినట్లు వెల్లడించింది. రష్యా సైన్యంలో చిక్కుకున్న భారతీయుల కేసులను ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరిస్తున్నట్లు ఎంబసీ అధికారులు తెలిపారు. 
Mohammed Ahmed
Russia Ukraine war
Hyderabad
Indian Embassy Moscow
recruitment agent
job fraud
human trafficking
MEA Jaishankar
Asaduddin Owaisi
Russia

More Telugu News