యూఏఈలో సీఎం చంద్రబాబు.. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా తొలిరోజు భేటీలు

  • యూఏఈలో సీఎం చంద్రబాబు పర్యటన ప్రారంభం
  • తొలిరోజు భారత రాయబారులు, పారిశ్రామికవేత్తలతో భేటీ
  • ఏపీలోని పెట్టుబడుల అవకాశాలను వివరించిన సీఎం
  • విశాఖలో గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రస్తావన
  • ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానంతో వేగంగా అనుమతులు
  • యూఏఈలోని తెలుగువారికి అండగా నిలవాలని ఎంబసీకి విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్‌కు భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు తన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పర్యటనను ప్రారంభించారు. పర్యటనలో భాగంగా తొలిరోజైన బుధవారం ఆయన దుబాయ్‌లో పారిశ్రామికవేత్తలు, భారత రాయబార కార్యాలయ అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను వారికి వివరించి, ఏపీకి రావాల్సిందిగా ఆహ్వానించనున్నారు.

తొలిరోజు పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు, దుబాయ్‌లోని భారత కాన్సుల్ జనరల్ సతీశ్‌ కుమార్ శివన్, అబుదాబీలోని డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమర్నాథ్‌లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, పోర్టులు, లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, డేటా సెంటర్లు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి కీలక రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను ఆయన వారికి వివరించారు. విశాఖపట్నంలో గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఏఐ డేటా హబ్ ఏర్పాటు చేయనుందన్న విషయాన్ని ఈ సమావేశంలో ప్రస్తావించారు. రాష్ట్రానికి ఉన్న 1054 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటూ పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని వేగవంతం చేశామని తెలిపారు.

పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానం ద్వారా తమ ప్రభుత్వం వేగంగా అనుమతులు మంజూరు చేస్తోందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. యూఏఈలోని వివిధ సావరిన్ ఫండ్స్ నుంచి ఏపీకి పెట్టుబడులను ఆకర్షించే అంశంపై కూడా ఈ భేటీలో ప్రత్యేకంగా చర్చించారు. ఇదే సమయంలో, యూఏఈలో నివసిస్తున్న తెలుగు ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సీఎం చంద్రబాబు ఎంబసీ అధికారులను కోరారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. "ప్రధాని మోదీ కృషితోనే భారత్‌లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఆయన ప్రపంచవ్యాప్తంగా భారతదేశ బ్రాండ్‌ను ప్రచారం చేస్తున్నారు. ఆయన వల్లే భారత్-యూఏఈ మధ్య వాణిజ్య, పెట్టుబడుల సంబంధాలు బలపడ్డాయి" అని చంద్రబాబు అన్నారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.




More Telugu News