Sara Tendulkar: 12 ఏళ్ల ఆరోగ్య సమస్య.. సచిన్ కుమార్తె సారాను వ్యాపారవేత్తగా మార్చిందిలా!

Sara Tendulkar Launches Pilates Studio Inspired by Health Journey
  • వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన సచిన్ కుమార్తె సారా టెండూల్కర్
  • 12 ఏళ్లుగా వేధిస్తున్న వెన్నునొప్పికి పిలేట్స్‌తో పరిష్కారం
  • వ్యక్తిగత అనుభవంతో సొంతంగా పిలేట్స్ స్టూడియో ప్రారంభం
  • స్టూడియోలోనే 'కైండా' పేరుతో ప్రత్యేక స్మూతీ, కేఫ్ ఏర్పాటు
  • తన నిర్ణయానికి తల్లిదండ్రులు పూర్తి మద్దతు తెలిపారన్న సారా
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తెగా అందరికీ సుపరిచితమైన సారా టెండూల్కర్ ఇప్పుడు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్నారు. దశాబ్ద కాలంగా తనను వేధిస్తున్న ఓ ఆరోగ్య సమస్యే ఆమెను వ్యాపారవేత్తగా మార్చింది. తన వ్యక్తిగత ఫిట్‌నెస్ ప్రయాణాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఆమె తాజాగా ఓ పిలేట్స్ స్టూడియోను ప్రారంభించారు.

12 ఏళ్ల నొప్పే స్ఫూర్తిగా!
సుమారు 12 ఏళ్లుగా తాను డిస్క్ సమస్యతో కూడిన వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు సారా స్వయంగా వెల్లడించారు. బయోమెడికల్ సైంటిస్ట్, రిజిస్టర్డ్ న్యూట్రిషనిస్ట్ అయిన ఆమె తన ఫిట్‌నెస్ ప్రయాణం గురించి మాట్లాడుతూ, "నేను ఎప్పుడూ స్ట్రెంత్ ట్రైనింగ్ చేసేదాన్ని. కానీ, అది నా వెన్నుకు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తున్నట్లు అనిపించింది. అందుకే నా ఫిట్‌నెస్ రొటీన్‌లో పిలేట్స్‌ను కూడా చేర్చుకున్నాను. ఇప్పుడు వారంలో రెండు, మూడు రోజులు పిలేట్స్, మరికొన్ని రోజులు స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తున్నాను. ఇది నా నొప్పిని తగ్గించడంలో ఎంతో సహాయపడింది" అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఆరోగ్య సమస్యకు పరిష్కారంగా మారిన పిలేట్స్‌పై ఆసక్తి పెంచుకున్న సారా, దానినే తన వ్యాపారంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. లండన్‌లో ఉన్నప్పుడు పిలేట్స్‌కు ఆకర్షితురాలైన ఆమె, ఇండియాకు తిరిగి వచ్చాక 'పిలేట్స్ అకాడమీ'తో కలిసి ఫ్రాంచైజీని ప్రారంభించారు. ప్రజలు ఒకచోట కలుసుకుని, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేలా ఒక కమ్యూనిటీని నిర్మించాలన్నది తన కల అని ఆమె వివరించారు. ఈ స్టూడియోలో 'కైండా' పేరుతో ప్రత్యేకంగా ఓ స్మూతీ బార్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ లభించే ఆరోగ్యకరమైన పానీయాలను స్వయంగా సారాయే పర్యవేక్షిస్తున్నారు.

తల్లిదండ్రుల పూర్తి మద్దతు 
ఈ కొత్త ప్రయాణం గురించి తన తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వారు ఏమాత్రం ఆశ్చర్యపోలేదని సారా అన్నారు. "మా అమ్మానాన్న ఇద్దరూ ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యం ఇస్తారు. వారికి పిలేట్స్ గురించి తెలుసు. నేను చేయడం చూశారు. అందుకే స్టూడియో తెరవడం సరైన ముందడుగు అని భావించారు" అని ఆమె పేర్కొన్నారు. తన తండ్రి సచిన్ ఎప్పుడూ "లభించిన స్వేచ్ఛను బాధ్యతాయుతంగా వాడుకోవాలి" అని చెప్పేవారని, ఆ మాటలనే స్ఫూర్తిగా తీసుకుని ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించానని సారా తెలిపారు.

Sara Tendulkar
Sachin Tendulkar
Pilates
Pilates Academy
fitness
health
business
entrepreneur
Kindaa
smoothie bar

More Telugu News