మా నాన్న రాజకీయ జీవితం చివరి దశలో ఉంది.. వారసుడు ఎవరంటే: సిద్ధరామయ్య కుమారుడి సంచలన వ్యాఖ్యలు
- బెళగావిలో జరిగిన ఒక కార్యక్రమంలో యతీంద్ర వ్యాఖ్యలు
- బలమైన, ప్రగతిశీల భావజాలం ఉన్న నాయకుడు ఇప్పుడు అవసరమని వ్యాఖ్య
- ఆ లక్షణాలు సతీశ్ ఝర్కిహోళిలో ఉన్నాయన్న యతీంద్ర
బెళగావి జిల్లాలో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో యతీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయాల్లో తన తండ్రి చివరి దశలో ఉన్నారని, ఈ సమయంలో బలమైన, ప్రగతిశీల భావజాలం కలిగిన నాయకుడు ఆయనకు అవసరమని అన్నారు.
అటువంటి నాయకుడికి సిద్ధరామయ్య మార్గదర్శకంగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. సతీశ్‌కు ఆ లక్షణాలు ఉన్నాయని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నడిపించేందుకు ఆయన సరైన వ్యక్తి అని యతీంద్ర అన్నారు. పెద్ద బాధ్యతలు స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉండాలని ఆకాంక్షించారు.
ముఖ్యమంత్రి మార్పును ఉద్దేశించి యతీంద్ర ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి మార్పు అంశంపై సిద్ధరామయ్య, డి.కె. శివకుమార్ మధ్య ఇప్పటికే పరోక్షంగా వాగ్యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో సతీశ్ పేరు తెరపైకి రావడం గమనార్హం.