పరవళ్లు తొక్కుతున్న తిరుపతి కపిలతీర్థం.. పోటెత్తిన పర్యాటకులు, స్థానికులు
- శేషాచలం అడవుల నుంచి భారీగా చేరుతున్న వరద నీరు
- తిరుమల భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా మారిన జలధారలు
- సెల్ఫీలు, ఫొటోలతో సందర్శకుల సందడి
శేషాచలం కొండల నుంచి వస్తున్న నీటితో కపిలేశ్వరస్వామి ఆలయం వద్ద ఉన్న జలపాతం నిండుగా ప్రవహిస్తోంది. దీంతో ఈ ప్రాంతమంతా సందడిగా మారింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు సైతం కపిలతీర్థాన్ని సందర్శించి, జలపాతం అందాలను ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా యువత, కుటుంబ సభ్యులతో కలిసి వస్తున్న సందర్శకులు ఉత్సాహంగా గడుపుతున్నారు.
ఈ అపురూప దృశ్యాలను తమ సెల్ఫోన్లలో బంధించేందుకు పర్యాటకులు పోటీ పడుతున్నారు. జలపాతం ముందు నిల్చొని సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. పర్యాటకుల రాకతో కపిలతీర్థం పరిసర ప్రాంతాల్లో కోలాహలం నెలకొంది.